ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపుచోటుచేసుకుంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్, శ్రవణ్ కుమార్ రావు కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అరెస్టుతో ఈ ముగ్గురు మాజీ పోలీస్ అధికారులు విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ కేసులో మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ) ఎన్. భుజంగరావును, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్న(గతంలో ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ)ను అరెస్ట్ చేసినట్టు శనివారం రాత్రి పోలీసులు ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్లిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ లను ట్యాప్ చేయడం, ఎవిడెన్స్ ను ధ్వంసం చేయడంలో పాత్ర పోషించినట్టుగా విచారణలో అంగీకరించారని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీసు వెల్లడించింది.
ఈ ఇద్దరు పోలీస్ అధికారులను ఆదివారం రిమాండ్ కు తరలించనున్నారు. ఇందులో భాగంగా వీరిద్దరికీ గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో కొంపల్లిలోని మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు.
