హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ వదలకుండా కుచ్చుటోపీ పెడుతున్నారు. ఓటీపీలు, కేవైసీ, లింకుల పేర్లతో వివిధ రకాలుగా జనాన్ని బురిడి కొట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వాళ్ల చేతికి చిక్కి ఏకంగా రూ.44 లక్షలు పొగొట్టుకున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పని చేసే ఇద్దరు ఇన్స్పెక్టర్స్ సైబర్ నేరస్తుల వలలో చిక్కారు. టీటీడీ దర్శనం పేరుతో ఓ ఇన్స్పెక్టర్ను బురిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు రూ.4 లక్షలు వసూలు చేశారు. స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడుల ద్వారా అధిక లాభం వస్తుందని ఆశ చూపించి మరో ఇన్స్పెక్టర్ నుంచి రూ.39 లక్షలు కాజేశారు.
డబ్బు తీసుకున్న తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్లు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేసి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఇద్దరు పోలీస్ ఇన్స్పెక్టర్లు సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన వారే. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరూ ఇన్స్పెక్టర్లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోవడం పోలీస్ వర్గా్ల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
