గంజాయి స్మగ్లింగ్​ చేస్తున్న..ఇద్దరు రైల్వే ఉద్యోగులు అరెస్ట్

గంజాయి స్మగ్లింగ్​ చేస్తున్న..ఇద్దరు రైల్వే ఉద్యోగులు అరెస్ట్
  • 14 కిలోల గంజాయి స్వాధీనం

సికింద్రాబాద్/వికారాబాద్/గచ్చిబౌలి, వెలుగు :  గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చే డబ్బు కోసం రైళ్లలో గంజాయిని చేరవేస్తున్న ఇద్దరు రైల్​కోచ్​ ఉద్యోగులను పోలీసులు సోమవారం అరెస్ట్​చేశారు. వారి నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్​రైల్వే సబ్​ఇన్​స్పెక్టర్​శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 31న మధ్యాహ్నం ఒంటి గంటకు వికారాబాద్​రైల్వేస్టేషన్​లో ఆగిన కోణార్క్ ఎక్స్​ప్రెస్​లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

బీ6 కోచ్​లోని ఇద్దరు ప్యాసింజర్ల బెడ్​రోల్ క్యాబిన్​కింద రెండు బ్యాగుల్లో 14 కిలోల గంజాయి దొరికింది. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లా అభయ్​పూర్​గ్రామానికి చెందిన మనోజ్ పరమార్​(25), మోరెనా జిల్లా ధరమ్​ఘర్​గ్రామానికి చెందిన అనిల్ ఉపాధ్యాయ్(28) అని తెలిసింది. మనోజ్​ పరమార్​కోణార్క్​ఎక్స్​ప్రెస్​ఏసీ కోచ్​లో అటెండెంట్​గా, అనిల్​ఉపాధ్యాయ్​అదే రైలులో ప్యాంట్రీకార్ వెండర్​గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గత నెల 30న సాయంత్రం 6 గంటలకు కోణార్క్​ఎక్స్ ప్రెస్​బరహంపూర్​రైల్వేస్టేషన్​కు చేరుకోగా ఓ అజ్ఞాత వ్యక్తి వీరి వద్దకు వచ్చి బీ-6 కోచ్​లో రెండు గంజాయి బ్యాగులు ఉన్నయ్.. ముంబైలో అందజేస్తే ఒక్కొక్కరికి రూ.25వేలు ఆశ చూపాడని నిందితులు ఒప్పుకున్నారు. 

రూ.37.50 లక్షలు సీజ్

రైలులో తరలిస్తున్న రూ.37.50లక్షలను సికింద్రాబాద్​జీఆర్​పీ, ఆర్పీఎఫ్​ పోలీసులు పట్టుకున్నారు. రైల్వే ఇన్​స్పెక్టర్ సాయి ఈశ్వర్​గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సికింద్రాబాద్​రైల్వే స్టేషన్ ​ఫ్లాట్​ఫాం నంబర్​1పై పోలీసులు తనిఖీ చేపట్టగా, తమిళనాడులోని కాంచీపురం మధురాంతకం ప్రాంతానికి చెందిన పి.లక్ష్మణరామ్(45) అనే వ్యక్తి వద్ద రూ.500 నోట్లతో కూడిన రూ. 37.50 లక్షలు దొరికాయి. నగదుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో సనత్​నగర్​ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో  సీజ్​చేశారు. 

కిరాణా షాపులో గంజాయి విక్రయం

కిరాణం షాపులో ఓ మహిళా గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. నానక్​రాంగూడలో అనురాధ బాయి(39) అనే మహిళ కిరాణా షాప్​నడుపుతోంది. ఆమె గంజాయి అమ్ముతుందనే సమాచారంతో మాదాపూర్​జోన్​ఎస్​ఓటీ పోలీసులు సోమవారం రైడ్​చేశారు.  39 ప్యాకెట్లు(300 గ్రాముల) గంజాయిని స్వాధీనం చేసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ధూల్​పేట్​నుంచి గంజాయి తెప్పించి కూలీలు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు అమ్ముతున్నట్లు గుర్తించి  కేసు నమోదు చేశారు.