కాగజ్‌నగర్, దహెగాం, వెలుగు: దహేగాం మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన నేర్పెల్లి సరస్వతి అనే గర్భిణిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇద్దరు రెస్క్యూ టీమ్మెంబర్లు బుధవారం వరద నీటిలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపట్టినా రాత్రివరకు ఆచూకీ దొరకలేదు. దహేగాం పక్కనుంచి వెళ్తున్న పెడ్డవాగు ఉప్పొంగడంతో దాహెగాంతో పెసరికుంట, ఐనమ్, ఇట్యల, రాళ్లగూడ, బీబ్రా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎమ్మెల్యే, కలెక్టర్ సింగరేణి రెస్క్యూ టీమ్ ను రప్పించారు. ఇదే టైమ్‌లో సరస్వతికి పురిటి నొప్పులు రావడంతో సింగరేణి రెస్క్యూ టీమ్‌కు చెందిన ఐదుగురితో పాటు స్థానిక యువకులు బడావత్ తిరుపతి, జార్పుల సతీష్, జర్పుల శ్యామ్, సిఐ నాగరాజు ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. రోప్ సాయంతో దహేగాం దగ్గరున్న మల్లన్న వాగు దాటారు. తర్వాత చిన్న కల్వర్టు వరద నీరు దాటుతుండగా.. వెనుక వైపున్న చెలుక సతీష్, అంబాల రాము గల్లంతు అయ్యారు. వీరు గల్లంతయిన విషయాన్ని మిగతా వాళ్లు గమనించే లోపు వారు కనపడకుండాపోయారు. చిన్న అయినమ్ గ్రామానికి చేరుకున్న మిగతా సభ్యులు ఉన్నతాధికారులకు సమాచారం అందించి గాలింపుచేపట్టారు. రాత్రి వరకు మరో రెస్క్యూ టీమ్ వచ్చి గాలింపు చేపట్టినా వారి ఆచూకీ లభించలేదు. గల్లంతైనవారు మందమర్రి ఏరియాకు చెందిన వారు. చెలక సతీష్ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో ఈ పీ ఆపరేటర్ గా, అంబాల రాము శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 లో జనరల్ మజ్దూర్ గా పని చేస్తున్నారు. గురువారం మళ్లీ గాలింపు చేపట్టనున్నారు.
