- అంతకుముందు ఇంటింటికీ వెళ్లి నీళ్లు అడిగిన టెర్రరిస్టులు
- గ్రామస్తుల సమచారంతో స్పాట్‌కు చేరుకున్న బలగాలు
- మంగళవారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆపరేషన్
- ఆర్మీ చెక్ పోస్ట్ పై కాల్పులు.. ఆరుగురు జవాన్లకు గాయాలు
- బస్సుపై దాడి తర్వాత వరుసగా టెర్రర్ అటాక్స్
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాను ఒకరు అమరుడైనట్టు జమ్మూ జోన్ పోలీసులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలోని సైదా గ్రామంలో ఇద్దరు టెర్రరిస్టులు ఇంటింటికీ వెళ్లి మంచినీళ్లు అడగడంతో అనుమానించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు స్పాట్‌కు చేరుకోగానే టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురుకాల్పులు జరిపి బుధవారం తెల్లవారుజామున ఒక టెర్రరిస్టును మట్టుబెట్టాయి. ఆపరేషన్ మధ్యాహ్నం దాకా కొనసాగించిన భద్రతా దళాలు మరో టెర్రరిస్టును కూడా కాల్చి చంపేశాయి. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారని, సైదా గ్రామస్తుడు ఒకరికి బులెట్ గాయాలయ్యాయని చెప్పారు.
కాశ్మీర్లో ఆర్మీ పోస్ట్‌పై దాడి
మూడు రోజుల క్రితం రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై దాడి చేసిన తర్వాత టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. బస్సుపై దాడి ఘటనలో 9 మంది చనిపోగా 41 మంది గాయపడ్డారు. దోడా జిల్లాలోని ఓ ఆర్మీ చెక్ పోస్ట్‌పై మంగళవారం రాత్రి టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు, ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. దొడా జిల్లాలోని ఛాతర్‌గలా ప్రాంతంలో ఆర్మీ, జమ్మూ పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను టెర్రరిస్టులు టార్గెట్ చేశారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సైన్యానికి టెర్రరిస్టులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయని వెల్లడించారు. లష్కరే తయిబా కమాండర్ అబు హమ్జా ఆదేశాల మేరకే పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్టులు రియాసి జిల్లాలో బస్సుపై దాడి చేసి అడవుల్లోకి పారిపోయారని చెప్పారు. వాళ్లకోసం భారీ సంఖ్యలో రైఫిల్స్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయన్నారు.
వేడుకల్లో మోదీ బిజీ: రాహుల్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో మూడు రోజుల్లో మూడు టెర్రరిస్ట్ అటాక్స్ జరగడంతో అక్కడ శాంతి నెలకొందని, పరిస్థితి నార్మల్ గా ఉందంటూ బీజేపీ చేసే ప్రకటనలు డొల్ల అని తేలిపోయిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న వాళ్లను బీజేపీ పాలనలో ఎందుకు పట్టుకోవడం లేదో సమాధానం చెప్పాలని దేశం డిమాండ్ చేస్తోందని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ‘‘అభినందన సందేశాలకు స్పందించడంలో, సెలబ్రేషన్స్ చేసుకోవడంలో నరేంద్ర మోదీ బిజీగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్ లో టెర్రరిస్టుల కాల్పుల్లో చనిపోయిన యాత్రికుల కుటుంబాల ఆర్తనాదాలు ఆయనకు వినపడటం లేదు”అని ఆయన విమర్శించారు.