
- ఇద్దరికి కరోనా కొత్త వేరియంట్ కన్ఫమ్
- ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి
- వచ్చిన యువతి, యువకుడు
- ఎయిర్ పోర్టులో చేసిన టెస్టుల్లో పాజిటివ్
- ఒమిక్రాన్ అని తేలేదాకా పట్టించుకోని అధికారులు
- బాధితులకు చెప్పకుండా, ట్రేస్ చేయకుండా నిర్లక్ష్యం
- మూడు రోజులు బయట తిరిగిన యువకుడు
- దవాఖాన్లు, రెస్టారెంట్ కు వెళ్లినట్టు గుర్తింపు
- పదుల సంఖ్యలో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు
- కంటైన్‌మెంట్ జోన్‌గా టోలీచౌకీ పారామౌంట్ కాలనీ
హైదరాబాద్, వెలుగు:ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్ మన రాష్ట్రంలోకీ ఎంటరైపోయింది. హైదరాబాద్ లో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్టు కన్ఫమ్ అయింది. కెన్యా నుంచి వచ్చిన యువతి, సోమాలియా నుంచి వచ్చిన యువకుడికి కొత్త వేరియంట్ సోకినట్టు తేలింది. ఆ యువతి వచ్చినప్పటి నుంచీ ఇంట్లోనే ఉంది. యువకుడు మాత్రం మూడు రోజులుగా సిటీలోని వివిధ ప్రాంతాలకు, దవాఖాన్లకు, రెస్టారెంట్లకు తిరగడంతో ఎంత మందికి కొత్త వేరియంట్ అంటుకుందోనన్న బుగులు షురువైంది. మిగతా కరోనా వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ స్పీడ్ గా వ్యాపిస్తుందని, టీకాలకు పెద్దగా లొంగదని, మన ఇమ్యూన్ సిస్టం చేతికి దొరకదంటూ రకరకాల వాదనలు వినిపిస్తుండటంతో దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నయి.
12వ తేదీన వచ్చిన్రు
వీళ్లిద్దరూ ఈ నెల12వ తేదీన వేర్వేరు ఫ్లైట్లలో హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇచ్చి వెళ్లిపోయారు. టెస్టుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మరుసటి రోజు వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీ (సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్) ల్యాబ్ కు పంపించారు. కానీ, అధికారులు నిర్లక్ష్యంతో వీళ్లిద్దరికీ పాజిటివ్ వచ్చిన విషయాన్ని తెలియజేయలేదు. ట్రేస్ చేయలేదు. ఇంతలో వీళ్లిద్దరికీ ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిందంటూ మంగళవారం సాయంత్రం సీడీఎఫ్‌డీ సైంటిస్టులు రిపోర్టులు ఇచ్చారు. దీంతో బాధితులను ట్రేస్ చేసేందుకు పోలీసులను తీసుకుని హెల్త్ ఆఫీసర్లు ఉరుకులు పరుగులు పెట్టారు.కెన్యాకు చెందిన అమ్మాయి టోలిచౌకీలోని పారామౌంట్ కాలనీలో ఉంటున్నట్టు తెలుసుకున్న అధికారులు మంగళవారం రాత్రి అక్కడికి చేరుకుని, ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించారు. ఆమె తండ్రి (70), మామ(33)ను ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించి, వారిద్దరికీ కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. కెన్యాకు చెందిన ఓ కేన్సర్ పేషెంట్‌కు అటెండెంట్ గా ఉండేందుకు ఈ అమ్మాయి వచ్చినట్టు సమాచారం. మూడు రోజులుగా ఈ అమ్మాయి ఇంట్లోనే ఉందని, బయటకు వెళ్లలేదని అధికారులు చెబుతున్నారు.
బయట తిరిగిన యువకుడు
అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి చికిత్స చేయించేందుకు హైదరాబాద్ వచ్చిన సోమాలియా యువకుడు కూడా టోలిచౌకీ పారామౌంట్ కాలనీలోనే ఉన్నాడు. ఆదివారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు టోలిచౌకీ, సోమాజిగూడ, జూబ్లిహిల్స్ తదితర ప్రాంతాల్లో తిరిగాడు. సోమవారం తండ్రిని యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. మంగళవారం, బుధవారం అపోలో హాస్పిటల్‌లో డాక్టర్లను కలిశాడు. అక్కడ డాక్టర్లకు చూపించుకుని, మధ్యాహ్నానికి రూమ్ కు వచ్చారు. అప్పటికే అక్కడున్న హెల్త్ స్టాఫ్ తండ్రీ కొడుకులిద్దరినీ అంబులెన్స్‌లో టిమ్స్‌కు తరలించారు.
నిర్లక్ష్యంతో ముప్పుతెచ్చిన్రు
పాజిటివ్ వచ్చిన విదేశీయులు బయట తిరగకుండా కట్టడి చేయడంలో ఎయిర్‌పోర్ట్ సర్వైలెన్స్ విభాగం అధికారులు నిర్లక్ష్యం చూపారు. వాళ్లిద్దరికీ కరోనా అని ఆదివారం ఎయిర్‌పోర్టులో చేసిన టెస్టుల్లోనే తేలింది. విషయాన్ని వారికి చెప్పలేదు. లోకల్ హెల్త్ ఆఫీసర్లకూ సమాచారం ఇవ్వలేదు. పోలీసులకు చెప్పి, ఎయిర్‌పోర్ట్‌లో వారు ఇచ్చిన వివరాల ఆధారంగా ట్రేస్ చేయించాల్సింది. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నరో, బయట తిరుగుతున్నరో నిఘా పెట్టాల్సింది. కానీ ఇవేమీ పట్టించుకోలేదు. మంగళవారం సాయంత్రం సీడీఎఫ్‌డీ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆ యువతికి ఫోన్ చేశారు. మరోవైపు ఆ యువకుడు ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు కాల్ చేస్తే, యశోద హాస్పిటల్‌కు చెందిన ఓ వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్, వెస్ట్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలోని నాలుగు టీమ్ లు బుధవారం మధ్యాహ్నం తర్వాత అతన్ని ట్రేస్ చేశారు. ఈ లోపలే అతను టోలిచౌకీ, సోమాజిగూడ, జూబ్లిహిల్స్ తదితర ప్రాంతాల్లో చాలా మందిని కలిశాడు. సిటీలో ఒమిక్రాన్ ఎంతమందికి అంటుకుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎయిర్ పోర్టులో రూల్స్ ఇలా..
ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 11 దేశాల నుంచి వస్తున్నవాళ్లందరికీ ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలి. రిజల్ట్ వచ్చేంతవరకూ ఎయిర్ పోర్టు నుంచి బయటకు పంపకూడదు. పాజిటివ్ వస్తే దవాఖానలో ఐసోలేషన్ లో ఉంచాలి. నెగెటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్‌లో నిఘా పెట్టాలి. ఎట్ రిస్క్ లిస్టులో లేని దేశాల నుంచి వచ్చే ఫ్లైట్లలో ర్యాండమ్‌గా 2% మందికి ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించాలి. పాజిటివ్ వస్తే శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలి. రిజల్ట్ వచ్చే వరకూ హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచాలి.
టోలిచౌకీలో అలజడి
ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన ఇద్దరు వ్యక్తులూ టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలోనే నాలుగు రోజులుగా ఉన్నారు. సోమాలియా యువకుడు తండ్రితో కలిసి అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేశాడు. పారామౌంట్ కాలనీలో ఉంటున్న సోమాలియా దేశస్తులను కలిశాడు. దీంతో అతనికి పదుల సంఖ్యలో ప్రైమరీ కాంటాక్టులు, సెకండరీ కాంటాక్టులు ఏర్పడ్డాయి. ఈ ఇద్దరి కోసం పోలీసులు, హెల్త్ ఆఫీసర్లు ఆ కాలనీలో బుధవారం జల్లెడ పట్టారు. ఒకేసారి పదుల సంఖ్యలో పోలీసులు రావడం, ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తమ కాలనీలోనే మూడు రోజులుగా తిరుగుతున్నాడని తెలియడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ కాలనీని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి అందరికీ టెస్టులు చేస్తున్నారు. బాధితుడు అద్దెకు దిగిన ఇంట్లోని ఇతర ఫ్లాట్లలో ఉంటున్న వాళ్ల వద్ద కరోనా టెస్టుల కోసం హెల్త్ స్టాఫ్ శాంపిల్స్ తీసుకున్నారు.
బెంగాల్ పిల్లాడికీ ఒమిక్రాన్
అబుధాబి నుంచి శంషాబాద్ మీదుగా వెస్ట్ బెంగాల్ కు వెళ్లిన ఓ ఏడేండ్ల పిల్లాడికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం ఈ నెల 11న అబుధాబి నుంచి ఈవై274 ఫ్లైట్(సీట్ నంబర్ 22డీ)లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. మరో ఫ్లైట్‌లో కోల్‌కతాకు వెళ్లిపోయారు. ర్యాండమ్ టెస్టింగ్‌లో ఆ కుటుంబ సభ్యుల శాంపిళ్లను శంషాబాద్ ఎయిర్‌పోర్టు హెల్త్ ఆఫీసర్లు సేకరించారు. పాజిటివ్ రావడంతో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించారు. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన ఆ బాలుడి వివరాలను వెస్ట్ బెంగాల్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు అధికారులు పంపించారు.కొత్తగా 186 కేసులు..
రాష్ట్రంలో మరో 186 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. బుధవారం 40,776 మందికి టెస్టులు చేస్తే, గ్రేటర్ హైదరాబాద్‌లో 63 మందికి, జిల్లాల్లో 123 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పింది. మొత్తం కేసుల సంఖ్య 6,78,874కు చేరగా, 6,71,052 మంది కోలుకున్నట్టుగా చూపించింది. మరో 3,812 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. కరోనాతో బుధవారం ఒకరు చనిపోగా, మృతుల సంఖ్య 4,010కి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది.ఒమిక్రాన్ సోకింది వీళ్లకే..
పేరు: ఇక్రాన్ ఇస్మాయిల్ ఖలీఫ్ (24)
దేశం: కెన్యా
ఈ నెల 12న క్యూఆర్1342 నంబర్ ఫ్లైట్ (సీట్ నంబర్ హెచ్25)లో ఖతార్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది.
టోలిచౌకీలోని పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 4 ఏరియాలోని ఓ ఇంట్లో ఉన్నది.
పేరు: అబ్దుల్లా అహ్మద్ నూర్(23)
దేశం: సోమాలియా
ఈ నెల 12న జీ9735 ఫ్లైట్(సీట్ నంబర్ వై3)లో ఖతార్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు.
టోలిచౌకీలోని పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 4 ఏరియాలోని అక్బర్ టవర్స్‌లో ఉన్నాడు.
వీరిద్దరూ వ్యాక్సిన్ సింగిల్ డోసు మాత్రమే తీసుకున్నరు.రాష్ట్రంలో కేసులు పెరగొచ్చు
ఒమిక్రాన్ స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుంది. రాష్ట్రంలో జనవరి మూడో వారం నుంచి లేదా ఫిబ్రవరిలో కేసులు పెరగొచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా కేసులు ఎక్కువైతే, ఆ ప్రాంతాల్లోనే ఆంక్షలు విధిస్తం. ప్రజలు స్వచ్ఛందంగా కరోనా రూల్స్ పాటించాలి.ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవాలి. తినేటప్పుడు మాత్రమే తీయాలి.
- పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుఒమిక్రాన్ డేంజర్.. తక్కువ అంచనా వేయొద్దు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ఇప్పుడున్న వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగానే ఉంది. వ్యాక్సిన్లు వేసుకున్నోళ్లలో ఇప్పటికే వచ్చిన ఇమ్యూనిటీ నుంచి ఒమిక్రాన్ తప్పించుకుంటోంది. బూస్టర్ డోస్ వేసుకుంటే దాని నుంచి రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే, ఒమిక్రాన్‌పై టీకాల పనితనాన్ని తెలుసుకునేందుకు మరింత రీసెర్చ్ చేయాల్సిన అవసరముంది. ఒమిక్రాన్ చాలా డేంజర్. దానిని తక్కువ అంచనా వేయొద్దు. డెల్టా సహా ఇంతకుముందున్న వేరియంట్లతో పోలిస్తే ఊహకందనంత వేగంగా ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. కేసులు భారీగా పెరిగే ముప్పుంది.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)