2 వేల ఇండ్ల నిర్మాణం.. మధ్యలోనే వదిలేసిన్రు

2 వేల ఇండ్ల నిర్మాణం.. మధ్యలోనే వదిలేసిన్రు

‘డబుల్​ ఇండ్లు’గా మారుస్తామన్న మంత్రి, ఎమ్మెల్యే

నెరవేరని నేతల హామీ

ఇండ్ల మధ్య చెత్తపోసి  డంపింగ్ ​యార్డుగా మార్చేస్తున్రు

సూర్యాపేట, వెలుగు: ఆరేళ్ల క్రితం కాంగ్రెస్​ హయాంలో చేపట్టిన ఇండ్ల నిర్మాణాలవి. 40 శాతం వరకు పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మారింది. దాంతో నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పనులు పూర్తి చేస్తే వేల కుటుంబాలకు గూడు దక్కే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అర్హులైన పేదలకు సొంతింటిని అందించాలనే లక్ష్యంతో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఫణిగిరిగట్టు వద్ద 2014 జనవరిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,160 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. రాజీవ్​ గృహకల్ప పథకం కింద సుమారు 25 ఎకరాల్లో రూ.98.50 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించారు. రూ.38 కోట్ల బడ్జెట్ రిలీజ్ ​చేయగా దాదాపు 40 శాతం పనులు పూర్తి చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీవ్ గృహకల్ప పథకాన్ని రద్దు చేయడంతో 2014 సెప్టెంబర్ లో పనులను ఆపేశారు.

నెరవేరని హామీ

ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆగిపోయిన ఇంటి నిర్మాణాల స్థానంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి ఆరు నెలల్లో అర్హులైన పేదలకు అందిస్తామని హుజూర్ నగర్ బై ఎలక్షన్ ముందు సైదిరెడ్డి హామీ ఇచ్చారు. గతంలో మంత్రి జగదీశ్​రెడ్డి హుజూర్ నగర్ లో పర్యటించిన సందర్భంలో ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రజలు వేడుకోగా సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను ‘డబుల్ ఇండ్లు’గా మార్చి  1,108 మందికి పంపిణీ చేస్తామని మాట ఇచ్చారు. అసంపూర్తి నిర్మాణాలను డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు రెడీ చేయాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆర్ అండ్​బీ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు సుమారు రూ.80 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రతిపాదనలే తప్ప పనులు ఎప్పుడు మొదలుపెడతారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం నిర్మాణాలున్న ప్రాంతం డంపింగ్ యార్డ్ గా మారింది. రూ.40 కోట్ల విలువైన ఇండ్లను చెత్తతో నింపేస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రింగురోడ్డూ ఆగిపోయింది

హుజూర్​నగర్ ​పట్టణానికి బైపాస్ రోడ్డు లేకపోవడంతో మఠంపల్లి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే భారీ వెహికల్స్​ఊరి మెయిన్​రోడ్డు మీదుగా వెళుతున్నాయి. దీంతో రోడ్లు, పైప్ లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దుమ్ము ధూళితో పట్టణవాసులు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి హుజూర్ నగర్ పట్టణ శివారులో 12 కి.మీ. ‌‌మేర 2013 సంవత్సరంలో రూ. 26 కోట్లతో రింగురోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు‌‌. అందులో 10 కి.మీ. వరకు పనులు పూర్తయ్యాయి. అయితే మధ్యలో ఎన్నెస్పీ కాలువ కట్టపై ఇండ్లు ఉండడంతో పనులు అక్కడితో ఆగిపోయాయి. ఎన్నెస్పీ కాల్వ కట్ట నిర్వాసితులకు ఇండ్లు నిర్మించి ఇస్తే వారిని అక్కడి నుంచి తరలించి రోడ్డు పనులు పూర్తి చేయవచ్చు. ఫణిగిరి గట్టు వద్ద ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో రింగురోడ్డు పనులు ఆగిపోయాయి.