వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతలు మృతి .. !

వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతలు మృతి .. !

మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం  కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందినట్టు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై గాంధి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాలింతలు చనిపోయారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు ఛాదర్ ఘాట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అనంతరం మలక్ పేట ఏరియా ఆసుపత్రి ముందు బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు.

ఈ ఘటపై ఆస్పత్రి సూపరింటెడెంట్ త్రిలోక్ స్పందించారు. ఇద్దరు బాలింతలకు ఈ నెల 11 న సి సెక్షన్  చేశామని చెప్పారు. అందులో ఓ మహిళకు12న 4 గంటలకు... హార్ట్ రేట్ పడిపోయిందని, వెంటనే గాంధీకి రిఫర్ చేశామన్నారు. ఆమె గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిందని చెప్పారు. ఇంకో మహిళకు అప్పటికే  హైపో థైరాడిజం ఉండడంతో... 12న రాత్రి షుగర్ లెవల్స్ పడిపోవడంతో గాంధీకి తరలించారని, ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిందని తెలిపారు. ఈ కేసుల్లో వైద్యుల నిర్లక్ష్యం లేదని, ఆపరేషన్ కి ముందు అన్ని పరీక్షలు చేశామని ఆయన స్పష్టం చేశారు.