
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెంలో ఘటన
నార్కట్‌పల్లి, వెలుగు: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెంలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన గెట్ టు గెదర్‌లో ఇద్దరు యువకులు చనిపోవడం విషాదం నింపింది. వివరాలిలా ఉన్నాయి.. చిన్నప్పటి నుంచి ఒకే చోట చదువుకున్న నకిరేకల్, నార్కట్ పల్లి, చౌటుప్పల్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు రెండేండ్ల కింద నార్కట్ పల్లి శివారులోని శ్రీ విద్యాపీఠ్ పాఠశాలలో టెన్త్ పూర్తి చేసుకున్నారు. ఓసారి కలుసుకుందామని నిర్ణయించుకొని జువ్విగూడెంలోని ఓ ఫామ్‌హౌస్‌లో 13 మంది విద్యార్థులు గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు.
సాయంత్రం వరకు ఎంజాయ్ చేశారు. సాయంత్రం ఫామ్‌హౌస్‌లో ఉన్న ఓ బావి నీటిలో నార్కట్ పల్లికి చెందిన నల్లగొండ రిషిక్(17), చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన పోలోజు హర్షవర్ధన్(17) మునిగిపోయారు. షాక్‌కు గురైన తోటి స్నేహితులు అరవడం మొదలుపెట్టారు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచరం ఇచ్చారు. ఘటనా స్థలానికి ఎస్సై క్రాంతి కుమార్ సిబ్బందితో చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల డెడ్‌బాడీలను బయటకు తీయించారు. పార్టీ చేసుకునేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.