‘హార్మూజ్’ను తెరిపించేందుకు రంగంలోకి యూఏఈ

‘హార్మూజ్’ను తెరిపించేందుకు రంగంలోకి యూఏఈ
  •     అంతర్జాతీయ నౌకాదళ టాస్క్​ఫోర్స్​లో చేరుతామని ప్రకటన

దుబాయ్: అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు యూఏఈ రంగంలోకి దిగింది. ఇరాన్ దిగ్బంధం కారణంగా మూతపడిన ఈ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఏర్పాటు కానున్న అంతర్జాతీయ నౌకాదళ టాస్క్‌ఫోర్స్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇరాన్ దాడుల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు, వాటిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు హార్మూజ్ సెక్యూరిటీ ఫోర్స్ పేరుతో ఒక బహుళజాతి దళాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 

ఈ ఆపరేషన్‌లో భాగంగా తన సొంత నౌకాదళాన్ని మోహరించేందుకు అబుదాబి సుముఖత వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం హార్మూజ్​జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇరాన్ దీన్ని మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొద్ది రోజులుగా ఇరాన్ నుంచి ఎదురవుతున్న క్షిపణి, డ్రోన్ దాడులను దృష్టిలో పెట్టుకొని యూఏఈ తన వైఖరిని కఠినతరం చేసింది.