
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులు చాలా రంగాల్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ సాఫ్ట్వేరోళ్ల కథే వేరు. ఈ క్షణం ఉన్న ఉద్యోగాలు, రేపు ఉంటాయో, ఊడతాయో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఐటీ రంగంలో ఉంది. ఇప్పటికే మెటా, ట్విటర్, విప్రో, టీసీఎస్, అమెజాన్లాంటి బడా కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తీసేస్తుండగా మరి కొన్ని కంపెనీలు అదే బాటలో పడ్డాయి.
విడతల వారీగా ఉద్యోగులను దించే ప్రక్రియకు పూనుకున్నాయి. తాజాగా ప్రముఖ క్యాబ్డ్రైవింగ్సేవల సంస్థ ఉబర్ ఉద్యోగులకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. రిక్రూట్మెంట్ డివిజన్ లో భాగంగా 200 మంది ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 32,700 మంది ఉద్యోగులను కలిగి ఉన్న ఉబర్ ఈ ఏడాది మొదట్లోనే రవాణా సేవల విభాగం నుంచి 150 మందిని తొలగించింది. ప్రస్తుతం 35 శాతం ఎంప్లాయిస్పై వేటు వేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకే కోతల కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.