- ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
- మూడు వేల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంక్ యూబీఎస్ హైదరాబాద్‌లో తమ కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీని) ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా వచ్చే రెండు సంవత్సరాల్లో మూడు వేల మంది ప్రొఫెషనల్స్‌ను నియమించుకోవాలని చూస్తోంది. ఈ సెంటర్‌తో హై-వాల్యూ ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఆపరేషన్స్, జీసీసీ లీడర్‌షిప్‌లో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ మరింత బలపడుతుందని యూబీఎస్ పేర్కొంది.
ఈ జీసీసీ ప్రారంభోత్సవంలో తెలంగాణ ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థలు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయని, యూబీఎస్ నిర్ణయం నగర విశ్వసనీయతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. దీన్ని ఇండియా–ఈయూ–స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే లాంగ్‌టర్మ్ భాగస్వామ్యంగా అభివర్ణించారు.
హైదరాబాద్‌లోని ప్రతిభావంతులైన టాలెంట్ పూల్, అనుకూల విధానాలు, అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయని, దీంతో ఇక్కడ మరింత విస్తరించాలని నిర్ణయించామని యూబీఎస్ తెలిపింది. ఏఐ సహా టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుతూ, కంపెనీ బిజినెస్ విస్తరణపై దృష్టి పెట్టనున్నామని పేర్కొంది.
