రాజకీయ లబ్ధి కోసమే యూసీసీ : అసదుద్దీన్ ఒవైసీ

రాజకీయ లబ్ధి కోసమే యూసీసీ :  అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఎన్నికల టైమ్​లో కేంద్ర ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అధిక ధరలు, నిరుద్యోగం, చైనా ఆక్రమణ  లాంటి సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇదంతా చేస్తున్నదని ఫైర్ అయ్యారు. ముస్లింలను టార్గెట్‌‌ చేస్తూ లబ్ధి పొందేందుకు ప్లాన్ చేస్తున్నదని ఆరోపించారు. శుక్రవారం దారుసలాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసదుద్దీన్ మాట్లాడారు. 

యూసీసీ.. ఆర్టికల్ 44కు విరుద్ధమన్నారు. పొలిటికల్‌‌ మైలేజ్‌‌ కోసమే ఈ ప్రయత్నమని, ఇండియాలో యూసీసీ అవసరమే లేదని తెలిపారు. యూసీసీ కేవలం ముస్లింలకే పరిమితమైన అంశం కాదని, క్రైస్తవులు, గిరిజనులకు కూడా మంచిది కాదని అన్నారు. దేశాన్ని బీజేపీ ఏం చేయాలనుకుంటున్నదని మండిపడ్డారు. యూసీసీపై తమ అభిప్రాయం గతంలోనే చెప్పామన్నారు. ప్రతి జనరల్‌‌ ఎలక్షన్‌‌కు ఆరు నెలల ముందు యూసీసీని బీజేపీ తెరపైకి తీసుకువస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్​ని కలిసి యూసీసీపై చర్చించాం

ఇటీవల సీఎం కేసీఆర్​ని కలిసి యూసీసీపై చర్చించామని అసదుద్దీన్ తెలిపారు. త్వరలో ఏపీ సీఎం జగన్​ను కూడా కలుస్తామని ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఫోన్​లో మాట్లాడి యూసీసీపై చర్చించామన్నారు. యూసీసీ విషయంలో ఆప్ వ్యవహార శైలి భిన్నంగా ఉందని విమర్శించారు. కేజ్రీవాల్ సపోర్ట్ చేస్తే.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ తన అభిప్రాయం ప్రకటించలేదని తెలిపారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బీజేపీకి సపోఈర్ట్ చేస్తానని చెప్పారని, అలాంటప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ కండువా కప్పుకోవాలని సూచించారు.