25 ఏళ్ల స్నేహ బంధం.. వాళ్ల అబద్ధాల వల్లే చెడింది

25 ఏళ్ల స్నేహ బంధం.. వాళ్ల అబద్ధాల వల్లే చెడింది
  • బీజేపీతో పొత్తు తెంచుకోవడానికి కారణం ఎమ్మెల్యేలకు చెప్పిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటుకు కొత్త పొత్తులు దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేన.. ఫలితాల తర్వాత విడిపోయాయి. ఇప్పుడు ఎన్సీపీ-కాంగ్రస్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది శివసేన. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే పదవి చేపట్టబోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ వివరణ

శివసేన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తు తెంచుకోవడానికి కారణాన్ని వారికి వివరించారాయన. బీజేపీ నేతల అబద్ధాల వల్లే.. దాదాపు 25 ఏళ్లుగా సాగుతున్న స్నేహ బంధం ముగిసే పరిస్థితి వచ్చిందని చెప్పారు ఉద్ధవ్. ఆ పార్టీ నేతలు మనల్ని మోసం చేస్తున్న తీరును అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యేలను కోరారాయన. కొత్త పొత్తు, ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చే చాన్స్ ఉందని చెప్పారు ఉద్ధవ్ ఠాక్రే.

READ ALSO: ఆర్టీసీ సమ్మెపై కేంద్ర రవాణా మంత్రి నుంచి కేసీఆర్‌కు ఫోన్

ఎన్నికల ముందు ఓకే చెప్పారని..

ఎన్నికల ముందు బీజేపీ శివసేన కలిసి పోటీ చేశాయి. కానీ, సీఎం పదవి సహా మంత్రుల విషయంలో 50:50 ఫార్ములాకు శివసేన పట్టుబట్టడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు నో చెప్పింది. ఎన్నికల సమయంలో ఈ ఒప్పందానికి బీజేపీ ఓకే చెప్పిందని శివసేన నేతలంతా గట్టిగా వాదించారు. కానీ ఆ మాట తాము ఎప్పుడూ చెప్పలేదంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. దీంతో ఏకంగా కేంద్ర మంత్రి పదవిని కూడా శివసేన వదులుకుని, బీజేపీతో పొత్తు తెంచుకుంది.