‘మహా’ సంక్షోభం.. రంగంలోకి ఉద్ధవ్ సతీమణి

‘మహా’ సంక్షోభం.. రంగంలోకి ఉద్ధవ్ సతీమణి

మహారాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఇప్పట్లో తెర పడే సూచనలు కనిపించడంలేదు. గౌహతి హోటల్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు మరో రెండు రోజులు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో... ఉద్దవ్ థాక్రే సతీమణి రష్మీ థాక్రే కూడా రంగంలోకి దిగారు. అసమ్మతి కూటమిలో చేరిన ఎమ్మెల్యేల భార్యలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. వారి భర్తలను ఒప్పించాలని కోరినట్లు సమాచారం. ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో రష్మీ థాక్రే మాట్లాడినట్లు టాక్. 

కానీ..షిండే వర్గం మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శివసేనను కాంగ్రెస్, ఎన్సీపీ హైజాక్ చేశాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాము శివసేన నుంచి గెలిచినవాళ్లమని...పార్టీ వీడలేదని అంటున్నారు. శివసేనను కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని ఏక్ నాథ్ షిండే ట్వీట్ చేశారు. శివ సైనికులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఇక ఏక్ నాథ్ షిండేకి కంచుకోట అయిన థానేలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. రాజకీయ సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి హింసాత్మక చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 30 వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉండనున్నాయి.