కిల్లర్ నర్స్ లూసీకి .. జీవితాంతం జైలు శిక్ష

కిల్లర్ నర్స్ లూసీకి ..  జీవితాంతం జైలు శిక్ష

లండన్: ఏడుగురు పసిబిడ్డలను చంపేసిన కిల్లర్ నర్స్​ లూసీ లెట్బీకి మాంచెస్టర్ క్రౌన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 33 ఏండ్ల లూసీ ఐదుగురు శిశువులను, ఇద్దరు బాలికలను చంపినట్లుగా కోర్టు ఇదివరకే దోషిగా తేల్చింది. ‘‘లూసీ పాల్పడిన నేరాలకుగాను ఆమె బతికినంతకాలం జైలులోనే గడపాలి”అని జడ్జి జేమ్స్ గోస్ తీర్పులో పేర్కొన్నారు. దీంతో.. తగిన న్యాయం జరిగిందంటూ బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. మరికొందరు తాము అనుభవించిన బాధ ముందు ఈ శిక్ష కూడా సరిపోదని అన్నారు.  

ఏడాదిలో ఏడుగురిని చంపింది.. 

జూన్ 2015 నుంచి జూన్ 2016 మధ్య ఇంగ్లాండ్​లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో ఏడుగురు చంటిబిడ్డలను చంపిన కేసులో లూసీని పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ కేసుకు సంబంధించిన తుది వాదనలు మాంచెస్టర్ కోర్టులో సోమవారం ముగిశాయి. నెలలు నిండకుండానే జన్మించిన శిశువులకు గాలిని ఇంజెక్ట్ చేయడం, పాలు ఎక్కువగా తాగించి ఊపిరాడకుండా చేయడం, ఇన్సులిన్‌‌‌‌ ఇచ్చి విషపూరితం చేయడం ద్వారా రోజుల వయసున్న పిల్లలను లూసీ చంపేసిందని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించింది. 

మరో ఐదుగురు పిల్లలను కూడా చంపేందుకు ప్రయత్నించింది కానీ, అందుకు ఆధారాలు లేవని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో లూసీని కోర్టు దోషిగా తేల్చింది. అయితే, సైకో నర్సును దోషిగా నిలబెట్టడంలో ఇండియన్ ఆరిజిన్  డాక్టర్ ఒకరు కీలక పాత్ర పోషించారు. కాగా, బ్రిటన్​లో జీవిత ఖైదును అత్యంత కఠిన శిక్షగా పేర్కొంటారు. ఇప్పటివరకు ఆ దేశంలో  ఇలాంటి శిక్ష మొత్తం 70 మందికి మాత్రమే పడింది.