హార్మూజ్‌‌‌‌‌‌‌‌ రీఓపెన్ కు రంగంలోకి బ్రిటన్

హార్మూజ్‌‌‌‌‌‌‌‌ రీఓపెన్ కు రంగంలోకి బ్రిటన్
  • దాదాపు 60 దేశాలతో అత్యున్నత స్థాయి సమావేశం 
  • మీటింగ్ లో పాల్గొన్న భారత్‌‌‌‌‌‌‌‌ 

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూతపడటంతో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు బ్రిటన్ రంగంలోకి దిగింది. ఈ కీలక జలమార్గాన్ని తిరిగి తెరిపించేందుకు దాదాపు 60 దేశాలతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ జలమార్గాలుగా పిలిచే సముద్ర మార్గాల్లో నౌకల ప్రయాణం నిరంతరాయంగా, స్వేచ్ఛగా సాగడం ఎంతో కీలకమని తెలిపారు.

‘‘హార్మూజ్ జలసంధి మూతపడటంతో భారత ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం పడుతున్నది. గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన అటాక్‌‌‌‌‌‌‌‌లో నావికులను కోల్పోయిన ఏకైక దేశం భారత్ మాత్రమే’’ అని చెప్పారు. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. భారత్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ, ఎల్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌జీ, ఇతర ఇంధన ఉత్పత్తులను మోసుకెళ్లే నౌకలకు సురక్షితమైన మార్గాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ‘‘మేం ఇరాన్ సహా ఇతర దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. 

గత కొన్ని రోజులుగా జరిగిన చర్చల ఫలితంగా ఆరు భారతీయ నౌకలు సురక్షితంగా ఈ జలసంధిని దాటగలిగాయి’’ అని ఆయన వెల్లడించారు. హార్మూజ్ జలసంధిని తెరిపిస్తానని చెప్పిన అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఒక్కసారిగా మాట మార్చారు. ‘‘బ్రిటన్ వంటి దేశాలు ఇరాన్‌‌‌‌‌‌‌‌తో యుద్ధంలో మాకు సహకరించలేదు. ఇప్పుడు చమురు కావాలంటే మీరే పోరాడి తెచ్చుకోండి లేదా మా దగ్గర కొనండి. అమెరికా ఇకపై ఎవరికీ ఉచితంగా సాయం చేయదు’’ అని తన ట్రూత్ సోషల్‌‌‌‌‌‌‌‌లో విరుచుకుపడ్డారు. 

బ్రిటన్ ప్రకటనపై 37 దేశాల సంతకం 

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో సముద్ర భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ బ్రిటన్ విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనపై 37  దేశాలు సంతకం చేశాయి. భారత్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలు ఇందులో ఉన్నాయి. 

దౌత్యపరమైన చర్యల ద్వారా నౌకల రాకపోకలను పునరుద్ధరించడమే కాకుండా, యుద్ధం ముగిసిన తర్వాత సైనికపరంగా ఎలాంటి భద్రత కల్పించాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.