
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి వార్తల్లో నిలిచారు. పలు వివాదాలతో ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొన్న ఆయనపై తాజాగా.. ఆయన విదేశీ టూర్లపై భిన్న వార్తలు వినిపిస్తున్నాయి. యూకే ప్రధాని రిషి సునాక్ విదేశీ పర్యటనల కోసం కేవలం ప్రైవేట్ జెట్ల కోసమే సుమారు రూ. 5 కోట్ల ఖర్చు పెట్టినట్లు ఓ నివేదిక తెలిపింది. ప్రైవేటు విమానాల్లో వెళ్లడం వల్లే ఇంత ఖర్చు అయినట్లు స్పష్టం చేసింది. పన్నుదారుల డబ్బును దుర్వినియోగం చేసినట్లు ఆ పార్టీ పేర్కొన్నది. ఈజిప్టులో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరయ్యేందుకు గానూ ప్రభుత్వం ప్రైవేట్ జెట్లకు దాదాపు రూ. 96 లక్షలు ఖర్చు చేసింది. ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు సుమారు రూ. 300 లక్షలు ఖర్చు చేయగా.. లాట్వియా నుంచి ఎస్టోనియా పర్యటలనకు రూ. 55 లక్షలు ఖర్చయింది. ఇక ఆయన వ్యక్తిగత ఖర్చులుగా సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది.
సునాక్ విదేశీ టూర్లకు ఖర్చుపై ప్రతిపక్ష లిబర్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజా ధనాన్ని ఇలా ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తు్న్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క ప్రజలు పన్నులు చెల్లించలేని దీనస్థితిలో ఉంటే.. ఇలా ఖర్చు చేయడమేంటని ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇటీవల రిషి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ కొత్త పాలసీపైనా విపక్షాలు మండిపడుతున్నాయి. తన భార్య అక్షతా మూర్తి వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ నూతన విధానాన్ని తీసుకొచ్చారంటూ రిషిపై విమర్శలు గుప్పిస్తున్నాయి.