UK PM: బ్రిటిష్ ప్రధానిని కట్టిపడేసిన షారుఖ్-కాజోల్ ప్రేమగీతం! DDLJ మెలోడీ మాయలో కేర్ స్టార్మర్.

UK PM: బ్రిటిష్ ప్రధానిని కట్టిపడేసిన షారుఖ్-కాజోల్ ప్రేమగీతం! DDLJ మెలోడీ మాయలో కేర్ స్టార్మర్.

యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ప్రధాన మంత్రి కేర్ స్టార్మర్ ముంబై పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్టూడియోను సందర్శించారు. నటి రాణీ ముఖర్జీ, YRF CEO అక్షయ్ విధానిలతో కలిసి స్టూడియోలోని సౌకర్యాలను పరిశీలించారు. ఎడిటింగ్ కన్సోల్‌ వద్ద కూర్చున్న ఆయన ఫోటోలు,  వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బ్రిటిష్ ప్రధానిని అత్యంత ఆకట్టుకున్న విషయం ఏమిటంటే .. - అది 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ)' సినిమాలోని ఒక పాట! 

మంత్రముగ్ధుడిని చేసిన షారుఖ్ సాంగ్..

యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్న ఒక వీడియోలో.. కేర్ స్టార్మర్ సౌండ్ రికార్డింగ్ స్టూడియోలో కన్సోల్ ముందు కూర్చుని ఉండగా, 'తుఝే దేఖా తో యే జానా సనమ్' పాట వినిపించారు.   ఆ పాటలోని మధురమైన బాణీలు, మనోహరమైన దృశ్యాలకు ముగ్ధుడైన స్టార్మర్.. ఆశ్చర్యపోతూ "ఇది 30 ఏళ్ల క్రితం నాటి పాట కదా అని వ్యాఖ్యానించారు. ఈ క్లాసిక్ పాటను ఆయన మరింత శ్రద్ధగా విన్నారు.  1995 అక్టోబర్ 20న విడుదలైన'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ)' లోని ఈ పాట, అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. షారుఖ్ ఖాన్, కాజోల్ తో చిత్రీకరించిన ఈ యుగళగీతాన్ని లెజెండరీ గాయకులు కుమార్ సాను, లతా మంగేష్కర్ ఆలపించారు. ఈ పాట విడుదలైన నాటి నుంచి నేటి వరకు భారతీయ యువతకు ప్రేమగీతంగా నిలిచింది. ఈ చిత్రం రికార్డు విజయం సాధించి, షారుఖ్, కాజోల్‌లను సూపర్ స్టార్‌డం వైపు నడిపించింది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash Raj Films (@yrf)

సాంస్కృతిక బంధాలు బలోపేతం

బ్రిటిష్ ప్రధాన మంత్రి కేర్ స్టార్మర్ లండన్ నుంచి నేరుగా ముంబైకి చేరుకున్నారు . అక్కడి నుండి భారీ పోలీసు భద్రత మధ్య YRF స్టూడియోస్ కు వెళ్లారు. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం భారత , బ్రిటిష్ సినీ పరిశ్రమల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం, సహకారాన్ని ప్రోత్సహించడం అని బ్రిటిష్ హైకమిషన్  ప్రకటన విడుదల చేసింది. కేర్ స్టార్మర్ ఈ పాటకు స్పందించిన తీరుపై నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. చాలా మంది మేము కూడా మొదట్లో ఇలాగే స్పందించాం అని కామెంట్ చేయగా, ఒకరు షారుఖ్ ఎక్కడికెళ్లినా హృదయాలను గెలుచుకుంటున్నారు అని చమత్కరించారు.

సినిమా చరిత్రలో రికార్డు!

దర్శకుడు ఆదిత్య చోప్రా తొలి చిత్రంగా తెరకెక్కిన ''దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ) ', భారతీయ సినీ చరిత్రలోనే ఎక్కువ కాలం ప్రదర్శించబడిన చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తయినా, ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో నేటికీ ప్రతిరోజూ ఒక ఆట ప్రదర్శించబడుతూ ఉండడం ఈ చిత్రానికి ఉన్న అపారమైన ప్రజాదరణకు నిదర్శనం. లాక్‌డౌన్ సమయంలో తప్ప, విడుదలైనప్పటి నుంచి ఈ థియేటర్‌లో ఈ సినిమా నిరంతరాయంగా ప్రదర్శిస్తున్నారు.

ప్రస్తుతం YRF సంస్థ 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ)' చిత్రాన్ని ఆధారం చేసుకుని 'కమ్ ఫాల్ ఇన్ లవ్: ది DDLJ మ్యూజికల్' పేరుతో ఇంగ్లీష్ భాషా స్టేజ్ మ్యూజికల్‌ను నిర్మిస్తోంది. ఈ మ్యూజికల్‌లో జెనా పాండ్యా, యాష్లే డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'DDLJ' పాట బ్రిటిష్ ప్రధానినే ఆకట్టుకోవడం, సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని మరోసారి చాటిచెబుతోంది. రాబోయే కాలంలో భారత, బ్రిటిష్ సినీ పరిశ్రమల మధ్య మరిన్ని అద్భుతమైన సహకారాలను మనం ఆశించవచ్చని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు..