ఉక్రెయిన్ నుంచి సేఫ్​ ప్లేస్​కు 800 కిలోమీటర్ల జర్నీ

ఉక్రెయిన్ నుంచి సేఫ్​ ప్లేస్​కు 800 కిలోమీటర్ల జర్నీ

హైదరాబాద్, వెలుగు: డాక్టర్​కావాలనే లక్ష్యంతో ఈ మధ్యనే ఉక్రెయిన్​కు పోయిన తెలుగు స్టూడెంట్లు యుద్ధం మొదలవడంతో కష్టాలు పడ్తున్నారు. కాలేజీల్లో చేరేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉండడంతో 50 మందికిపైగా స్టూడెంట్లు అక్కడకు వెళ్లారు. అందులో హైదరాబాద్​కు చెందినవాళ్లే పది మందికిపైగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు కాలేజీల్లో చేరగా.. మరికొందరు ఇంకా చేరాల్సి ఉంది. ఉక్రెయిన్​లో మెడిసిన్​ చదువుకు ఫీజు తక్కువగా ఉండడంతో చాలామంది కన్సల్టెన్సీల ద్వారా అక్కడికి వెళ్తుంటారు. వాస్తవానికి యుద్ధ పరిస్థితులు ఏర్పడడంతో పలువురు తర్వాత వెళ్దామని అనుకున్నా.. జాయిన్​ అయిన వెంటనే  రావాలంటూ కన్సల్టెన్సీలు బలవంతపెట్టడంతో అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ ఇరుక్కుపోయారు. ఎప్పుడు ఏమవుతుందోనని భయపడుతున్నారు. కొందరు సీనియర్​స్టూడెంట్లు ధైర్యం చెప్తున్నా.. లోలోపల టెన్షన్​పడుతున్నారు. తాము ఇబ్బంది పడ్తున్నట్టు ఇంట్లో తెలిస్తే పేరెంట్స్​భయపడతారన్న ఉద్దేశంతో చాలామంది పేర్లు చెప్పేందుకు కూడా వెనుకాడుతున్నారు. తమ పిల్లలు ఎట్లున్నరోనని ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

యూనివర్సిటీ కింద బంకర్లలో దాక్కున్న 500 మంది స్టూడెంట్స్ 
ఉక్రెయిన్​ రాజధాని కీవ్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో చాలామంది స్టూడెంట్లు అక్కడి అండర్​గ్రౌండ్ బంకర్లలో దాక్కున్నారు. ఓ యూనివర్సిటీ కింద ఏర్పాటు చేసిన బంకర్​లో దాదాపు 500 మంది దాకా ఉన్నట్లు తెలుగు స్టూడెంట్లు చెప్తున్నారు. తిండి కూడా సరిగ్గా దొరకట్లేదని, ఇన్​స్టంట్​ఫుడ్​తో మాత్రమే కడుపు నింపుకొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. కేవలం బార్డర్​ ఏరియాలో ఉంటున్నోళ్లనే తీస్కపోయేందుకు చర్యలు తీసుకుంటున్నారని, తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఎప్పుడు ఏ మిస్సైల్ వచ్చిపడుతుందోనని బిక్కు బిక్కుమంటుూ..

ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లో పరిస్థితి పూర్తి భయానకంగా ఉందని, ఎప్పుడు ఏ మిస్సైల్​ వచ్చి పడుతుందో తెలియని దుస్థితి నెలకొందని అక్కడ చిక్కుకుపోయిన సికింద్రాబాద్​కు చెందిన మెడిసిన్​ స్టూడెంట్​అనీలా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ‘వెలుగు’తో ఆన్​లైన్​లో మాట్లాడారు. రోజురోజుకు కీవ్​లో పరిస్థితి చేయి దాటిపోతోందని, బాంబులతో దద్దరిల్లుతోందన్నారు. దాంతో తను మరో 20 మంది ఇండియన్ ​స్టూడెంట్స్​కలిసి 800 కి.మీ. దూరంలోని హంగేరీ బార్డర్ దగ్గరున్న సిటీకి వెళుతున్నట్లు పేర్కొన్నారు. ముందుగా ట్రెయిన్​లో తర్వాత కొద్ది దూరం బస్సులో జర్నీ చేస్తున్నామని చెప్పారు. అక్కడ కొద్ది రోజులుండి, పరిస్థితులు చక్కబడ్డాక, హంగేరి వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు వస్తామన్నారు.