పుతిన్, ట్రంప్ ప్రయత్నాలు భేష్.. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం: ఇండియా

పుతిన్, ట్రంప్ ప్రయత్నాలు భేష్.. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం: ఇండియా
  • ఉక్రెయిన్​, రష్యా యుద్ధానికి తెరపడాలి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​, రష్యా మధ్య శాంతియుత వాతావరణం కోసం పుతిన్​, ట్రంప్​ చర్చలను తాము స్వాగిస్తున్నామని.. యుద్ధానికి తెరపడాలని తాము ఆకాంక్షిస్తున్నామని ఇండియా పేర్కొంది. ‘‘అలాస్కా వేదికగా ట్రంప్​, పుతిన్​ భేటీ కావడం ఆహ్వానించదగ్గ పరిణామం. శాంతి స్థాపనలో వారి ప్రయత్నం ప్రశంసనీయం” అని భారత విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

అలాస్కా సమావేశం షెడ్యూల్​ ప్రకటించినప్పుడు కూడా ఇండియా స్వాగతించింది. ఇప్పుడు మీటింగ్​ తర్వాత కూడా స్టేట్​మెంట్​ ఇచ్చింది. చర్చల ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుందని తాము బలంగా నమ్ముతున్నామని, ఇప్పుడు ఉక్రెయిన్​, రష్యా యుద్ధం కూడా చర్చల ద్వారా పరిష్కారమవుతుందనే విశ్వసిస్తున్నామని మన విదేశాంగ శాఖ తెలిపింది. ప్రపంచం మొత్తం ఈ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నదని, ఆ దిశగా మొదలైన చర్చలు సత్ఫలితాలు ఇవ్వాలని ఆకాంక్షించింది.