రష్యా ఉస్ట్లు గా టెర్మినల్పై మళ్లీ దాడి.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వెల్లడి

రష్యా ఉస్ట్లు గా టెర్మినల్పై మళ్లీ దాడి.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వెల్లడి

మాస్కో: రష్యాలోని అత్యంత కీలకమైన ఉస్ట్-లుగా చమురు ఎగుమతి టెర్మినల్‌‌పై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో విరుచుకుపడింది. గత వారం రోజుల్లో ఈ కేంద్రంపై దాడి జరగడం ఇది మూడోసారి. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ మెరుపు దాడిలో టెర్మినల్ వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఈ పరిణామం రష్యా చమురు ఎగుమతులకు కోలుకోలేని దెబ్బ తీసింది.

ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందిస్తూ.. ఉస్ట్-లుగా టెర్మినల్ ఎగుమతి సామర్థ్యంలో దాదాపు 60% ప్రస్తుతం దెబ్బతిన్నట్లు ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ రాత్రికి రాత్రే సుమారు 345 డ్రోన్లను రష్యాపైకి ప్రయోగించింది.

అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా చమురు రంగానికి ఎదురైన అత్యంత తీవ్రమైన ముప్పు ఇదే. రష్యా ఎగుమతి సామర్థ్యంలో ప్రస్తుతం సుమారు ‘40%’ నిలిచిపోవడంతో రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

కాగా,  రష్యా తమ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపితే, తాము కూడా రష్యా చమురు కేంద్రాలపై దాడులు ఆపేస్తామని  జెలెన్ స్కీ చెప్పారు. ఈ దాడులకు ప్రతీకారంగా రష్యా కూడా ఉక్రెయిన్‌‌పై భీకర దాడులు ప్రారంభించింది. సుమారు 400 మిసైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌‌లోని ఖార్కివ్, ఒడెస్సా ప్రాంతాల్లోని విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది.