ఉక్రెయిన్​పై దాడికి.. రష్యా ఫైనల్ ప్రిపరేషన్!

ఉక్రెయిన్​పై దాడికి.. రష్యా ఫైనల్ ప్రిపరేషన్!
  • చర్చలకు సిద్ధమేనంటూ అమెరికా ప్రకటన 
  • ఇది చర్చలకు టైంకాదన్న రష్యా

కీవ్/వాషింగ్టన్: ఉక్రెయిన్​పై దాడి దిశగా ఫైనల్ ప్రిపరేషన్లు చేపట్టాలంటూ రష్యా తన మిలిటరీకి ఆదేశాలు ఇచ్చిందని అమెరికా వెల్లడించింది. బార్డర్ల నుంచి సోల్జర్ల వాపస్​ విషయంలో తమ హామీని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆదివారం రష్యా ప్రకటించడంతో..  దాడి దిశగా మరో అడుగు ముందుకే వేసినట్లు తేలిపోయిందని ప్రకటించింది. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదంటూ ఆ దేశాన్ని మూడు వైపులా 1.50 లక్షల సైన్యంతో చుట్టుముట్టిన రష్యా.. కొన్నాళ్లుగా బార్డర్లలో పెద్ద ఎత్తున మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఉక్రెయిన్ కు నార్త్ వైపున బెలారస్ లో 30 వేల మందిని, మిగతా వాళ్లను తూర్పున రష్యన్ భూభాగంలో, సౌత్ వైపున క్రీమియాలోనూ మోహరించింది. ఉక్రెయిన్ కు సమీపంలోకి భారీ ఎత్తున వార్ ట్యాంకులు, ప్లేన్స్, ఆర్టిలరీ వంటి వాటినీ తరలించింది. బలగాలను వెనక్కి తీసుకోవాలని, ఉక్రెయిన్ పై దాడి చేస్తే మాత్రం కఠిన ఆంక్షలు విధిస్తామని రష్యాను ఇదివరకే అమెరికా, బ్రిటన్, తదితర దేశాలు హెచ్చరించాయి. దాడి చేసే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని చెబుతూ వస్తున్న రష్యా.. బలగాలను వెనక్కి తీసుకుంటామని కూడా ఇటీవల ప్రకటించింది. కానీ రష్యా మరిన్ని బలగాలను బార్డర్లకు తరలిస్తోందని, దాడి చేసేందుకు దాదాపుగా సిద్ధమైందని అమెరికా చెప్తోంది. ఇక ఉక్రెయిన్ పౌరులు మాత్రం యుద్ధం రాకూడదని కోరుకుంటున్నారు. శాంతి ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఆదివారం వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు కీవ్ లోని క్యాథెడ్రల్ చర్చిలోనూ ప్రార్థనలు చేశారు. 

భేటీకి వైట్​హౌస్ ఓకే.. క్రెమ్లిన్ నో 

ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రన్ మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ అంశంపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్​ యూరప్​లో భేటీ కానున్నారంటూ ఫ్రాన్స్ ప్రకటన చేసింది. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్​హౌస్ పాజిటివ్​గా స్పందించగా.. రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ మాత్రం ప్రెసిడెంట్ల భేటీకి ఇది తగిన టైమ్​కాదని కొట్టిపారేసింది. పుతిన్​తో చర్చించేందుకు  బైడెన్ సూత్రప్రాయంగా అంగీకరించారని వైట్​హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ ఆదివారం మీడియాకు వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్​పై దాడి మొదలుపెట్టనంత వరకే అమెరికా చర్చలకు ఒప్పుకుంటుందని స్పష్టం చేశారు. దీనిపై క్రెమ్లిన్ సోమవారం స్పందిస్తూ.. ఇద్దరు నేతల మీటింగ్​కు ఇది తగిన సమయం కాదని ప్రకటన చేసింది. ప్రస్తుతానికి ఫారిన్ మినిస్టర్ల స్థాయిలో మాత్రమే చర్చలు జరపాలన్న అంగీకారం కుదిరిందని, ప్రెసిడెంట్ల స్థాయిలో చర్చలకు ఎలాంటి ప్లాన్లూ లేవని 
స్పష్టం చేసింది.

బార్డర్​లో ఐదుగురిని కాల్చేసిన రష్యన్​ ఆర్మీ

తమ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉక్రెయిన్ నుంచి బార్డర్ దాటి వచ్చిన ఐదుగురు చొరబాటుదారుల్ని కాల్చిచంపా మని సోమవారం రష్యన్ ఆర్మీ ప్రకటించింది. ఉక్రెయిన్ వైపు నుంచి మోర్టార్ షెల్స్ కూడా ప్రయోగించారని.. బార్డర్​లోని తమ ఫెసిలిటీని ధ్వంసం చేశారని తెలిపింది. అయితే, తాము ఎలాం టి దాడులు, చొరబాట్లు చేపట్టలే దని ఉక్రెయిన్ స్పష్టంచేసింది. ‘‘డోన్ సాక్, లుగాన్ స్క్ ప్రాంతా లపై ఉక్రెయిన్ దాడులు చేయలే. సాయుధ వ్యక్తులను పంపలేదు. రష్యా వైపు మోర్టార్ షెల్స్ కూడా ప్రయోగించలేదు. ఇలాంటి ఆలోచనలేవీ మాకు లేవు. రష్యా ఫేక్ ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలి” అని ఖండిస్తూ ఉక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ దిమిత్రో కులేబా ట్వీట్ చేశారు.