రష్యా – ఉక్రెయిన్ మధ్య ఫలించని చర్చలు 

రష్యా – ఉక్రెయిన్ మధ్య ఫలించని చర్చలు 

రష్యా – ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. బెలారస్ సరిహద్దులోని గోమెల్లో ఇరు దేశాల ప్రతినిధులు దాదాపు 4 గంటల పాటు చర్చలు జరిపినా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. షరతులు, డిమాండ్ల విషయంలో ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు సమాచారం. వెంటనే కాల్పుల విరమణ చేయాలని, డాన్ బాస్ నుంచి రష్యా సైన్యం వైదొలగాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. 

మరోవైపు అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేరబోమని ఉక్రెయిన్ లిఖితపూర్వకంగా రాసివ్వాలని రష్యా డిమాండ్ చేసింది. అలా చేస్తేనే సైన్యాన్ని ఉపసంహరిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ మాత్రం నాటో కూటమిలో చేరే విషయంలో వెనక్కి తగ్గేందుకు నిరాకరించినట్లు సమాచారం. తక్షణమే సైనిక చర్యను విరమించుకొని, బలగాలను ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. క్రిమియా నుంచి కూడా రష్యా సైనిక బలగాలను ఉపసంహరించాలని ఉక్రెయిన్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.