యుద్ధంలో రష్యన్ సోల్జర్లు లక్ష మంది చనిపోయిన్రు

యుద్ధంలో రష్యన్ సోల్జర్లు లక్ష మంది చనిపోయిన్రు

కీవ్/మాస్కో:  రష్యాతో తొమ్మిది నెలలుగా జరుగుతున్న యుద్ధంలో తమ సోల్జర్లు 13 వేల మంది దాకా చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ సలహాదారు మైఖాయిలో పోడోల్యాక్ వెల్లడించారు. ఉక్రెయిన్ బలగాల దాడుల్లో దాదాపు లక్ష మంది రష్యన్ సోల్జర్లు చనిపోయి ఉంటారని అన్నారు. యుద్ధంలో గాయపడిన సోల్జర్ల సంఖ్య భారీగానే ఉందని తెలిపారు. రష్యా దాడుల్లో చనిపోయిన పౌరుల సంఖ్య కూడా గణనీయంగా ఉందన్నారు. యుద్ధంలో మరణాల విషయంపై ఉక్రెయిన్ మిలిటరీ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు రష్యా నుంచి కూడా మృతుల విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో గాయపడిన వారు, మరణించిన వారు దాదాపు లక్ష మంది వరకు ఉండొచ్చని బుధవారం యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ కార్యాలయం ప్రకటించింది. అమెరికా మిలిటరీ ఆఫీసర్ జనరల్ మార్క్ మిల్లీ పోయిన నెలలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ వైపు 40 వేల మంది పౌరులు చనిపోయారని తెలిపారు. దాదాపు లక్ష మంది రష్యన్ సోల్జర్లు మృతిచెందారని పేర్కొన్నారు.   

విలీనాన్ని గుర్తిస్తేనే చర్చలు: రష్యా 

ఉక్రెయిన్ లో తాము స్వాధీనం చేసుకుని, రెఫరెండం ద్వారా విలీనం చేసుకున్న ప్రాంతాలను రష్యన్ భూభాగాలుగా గుర్తిస్తేనే చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటించింది. యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైతే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్​తో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధమని గురువారం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్​తో భేటీ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. అయితే, బైడెన్​తో పుతిన్ చర్చలకు రావాలంటే ముందుగా తాము చేసుకున్న విలీనాలను ఆమోదించాలని శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ స్పష్టం చేసింది.

  • జెలెన్ స్కీని కలిసిన బేర్ గ్రిల్స్
  •  ధైర్యంగా ఉండాలంటూ పోస్ట్ 

కీవ్: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీని బ్రిటన్ కు చెందిన టీవీ స్టార్ బేర్ గ్రిల్స్ కలిశారు. జెలెన్ స్కీతో ప్రోగ్రామ్ చేశానని, అది త్వరలోనే ప్రసారం కానుందని ఆయన వెల్లడించారు. ‘‘ఈ వారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు వెళ్లాను. అక్కడ ప్రెసిడెంట్ జెలెన్ స్కీని కలిశాను. ఓవైపు దేశంలో చలి మొదలవుతోంది. మరోవైపు వాళ్లపై దాడి జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కోట్లాది మంది ప్రాణాలు కాపాడుకోవడానికి రోజువారీ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జెలెన్ స్కీతో ప్రత్యేక ప్రోగ్రాం చేశాను. అది త్వరలోనే ప్రసారమవుతుంది. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు జెలెన్ స్కీకి ధన్యవాదాలు.. ధైర్యంగా ఉండండి” అంటూ ఇన్​స్టాగ్రామ్​లో  బేర్ గ్రిల్స్ పోస్టు పెట్టారు.