ఉక్రెయిన్​పై 60 మిసైళ్లు... 4 నగరాలు లక్ష్యంగా రష్యా దాడులు

ఉక్రెయిన్​పై  60 మిసైళ్లు... 4 నగరాలు లక్ష్యంగా రష్యా దాడులు

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ మిసైళ్ల వర్షం కురిపించింది. శుక్రవారం ఒక్కరోజే 60కి పైగా మిసైళ్లను ప్రయోగించింది. దేశ రాజధాని కీవ్, జపరోజియా, ఖార్కీవ్, క్రైవీ రిహ్ సిటీలు టార్గెట్ గా విరుచుకుపడింది. ఈ నాలుగు పట్టణాల్లోని వాటర్, కరెంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై దాడి చేసింది. రష్యా దాడిలో ఉక్రెయిన్ కు భారీ నష్టం వాటిల్లింది. ఈ సిటీల్లో వాటర్, కరెంట్ సరఫరా వ్యవస్థ నాశనమైంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ సొంతూరు క్రైవీ రిహ్ పై జరిగిన మిసైల్ దాడిలో ఇద్దరు చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని అక్కడి గవర్నర్ వలెంటైన్ రెజ్నిచెంకో తెలిపారు. జపరోజియాపై రష్యా 18 మిసైళ్లను ప్రయోగించినట్టు రీజినల్ గవర్నర్ చెప్పారు. ఖార్కీవ్ పై రష్యా మూడు మిసైళ్లను ప్రయోగించిందని, పవర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను దెబ్బతీసిందని మేయర్ ఇహోర్ తెరెఖోవ్ తెలిపారు. కీవ్ రీజియన్ లోని నాలుగు జిల్లాల్లో మిసైల్ దాడులు జరిగాయని మేయర్ విటాలీ తెలిపారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. క్రూయిజ్ మిసైళ్లు, ఎయిర్ క్రాఫ్ట్ బాంబర్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి యూరీ వెల్లడించారు. రష్యా ప్రయోగించిన 60కి పైగా మిసైళ్లలో కొన్నింటిని అడ్డుకున్నామని చెప్పారు. కాగా, ఉక్రెయిన్ కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను అమెరికా అందజేస్తే దాన్ని నాశనం చేస్తామని గురువారం హెచ్చరించిన రష్యా.. ఆ మరుసటిరోజే ఉక్రెయిన్ పై మిసైళ్ల దాడి చేసింది. 

2 లక్షల సైన్యంతో కీవ్ పై దాడికి ప్లాన్.. 

కీవ్ ను ఆక్రమించుకునేందుకు రష్యా ప్లాన్ చేస్తోంది. ‘‘కీవ్ లక్ష్యంగా 2023 ఫిబ్రవరి లేదా మార్చిలో రష్యా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ఇందుకోసం 2 లక్షల మంది సైనికులను రెడీ చేస్తోంది. యుద్ధ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు దాడులు తగ్గించింది. మేం కూడా రష్యాను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాం. ఫ్రంట్ లైన్ ను కాపాడుకోవడమే మా ప్రధాన లక్ష్యం. మాకు అవసరమైన ఆయుధాలు సమకూర్చుకుంటున్నాం” అని ఉక్రెయిన్ కమాండ్ ఇన్ చీఫ్ జనరల్ వలేరీ జలుజ్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రక్షణ సహకారంపై మోడీ, పుతిన్ చర్చ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా ప్రెసిడెంట్  వ్లాదిమిర్  పుతిన్  రక్షణ సహకారంపై చర్చించుకున్నారు. అలాగే ఇంధన రంగం, వాణిజ్యం, పెట్టుబడులు తదితర 
అంశాలపైనా వారి మధ్య చర్చలు జరిగాయి. ఇరు దేశాల అధినేతలు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఇక రష్యా‌‌–ఉక్రెయిన్  యుద్ధంపైనా మోడీ స్పందించారని, చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పుతిన్ కు మోడీ మరోసారి సూచించారని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జీ20కి ఇండియా అధ్యక్షత వహించడంపైనా పుతిన్ కు మోడీ వివరించారని వారు వెల్లడించారు.