రష్యా 2 లక్షల సైన్యాన్ని సిద్ధం చేస్తోంది : ఉక్రెయిన్

రష్యా 2 లక్షల సైన్యాన్ని సిద్ధం చేస్తోంది : ఉక్రెయిన్

ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 24న ప్రారంభమై ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కమాండ్ ఇన్ చీఫ్ జనరల్ వలేరీ జలుజ్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 తొలి నెలల్లో రష్యా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. దీని కోసం కొత్తగా 2 లక్షల మంది సైనికులను రష్యా సిద్ధం చేసుకుంటోందని ఆరోపించారు. ది ఎకానమిస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఉక్రెయిన్ రాజధానిని రష్యా మళ్లీ లక్ష్యంగా చేసుకుంటుందని.. ఫిబ్రవరి లేదా మార్చిలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని జలుజ్నీ తెలిపారు. ప్రస్తుతం రష్యా దాడులకు తగ్గించుకోవడం కూడా యుద్ధవ్యూహంలో భాగమేనన్నారు.  తాము కూడా రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని అన్ని లెక్కలు వేసుకుంటున్నామని చెప్పారు. ఎన్ని ట్యాంకులు, ఆయుధాలు, సైనికులు కావాలనే విషయంలో తాము కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. 

ఇప్పుడు తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం ఫ్రంట్ లైన్ ను కాపాడుకోవడమేనని జలుజ్నీ చెప్పారు. తాము శత్రువును ఓడించగలమని..అయితే అందుకు ఆయుధ వనరులు కావాలని అన్నారు. 300 యుద్ధ ట్యాంకులు, 600 నుంచి 700 వరకు ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్స్, 500 హోవిట్జర్ లు తమకు అవసరమని తెలిపారు.