అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్లో ఉక్రెయిన్‌కు చెందిన ఓ ప్యాసింజర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో176 మంది సజీవ దహనమయ్యారు. 167 మంది ప్యాసింజర్లు కాగా 9 మంది సిబ్బంది ఉన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమైనీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బుధవారం తెల్లవారుజామున టేకాఫ్ తీసుకున్న 2 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. ప్లేన్2,400 మీటర్ల ఎత్తులో ఉండగా ఓ ఇంజన్లో మంటలు రావడంతో పైలట్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో వేగంగా వచ్చి ఎయిర్‌పోర్టుకు 45 కిలోమీటర్ల దూరంలో భూమిని ఢీకొట్టి పేలిపోయింది.
టెహ్రాన్ / కీవ్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కుప్పకూలిపోయింది. దీంతో విమానంలో ఉన్న 176 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 167 మంది ప్యాసింజర్లు, 9 మంది సిబ్బంది ఉన్నారు. మంటల్లో చిక్కుకున్న విమానం వేగంగా కిందికి పడిపోతున్న వీడియో వైరల్ అయింది. విమానం భూమిని ఢీకొట్టగానే పెద్ద పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఒక్కరు కూడా బతకలేదు.
ఇంజన్లో మంటల వల్లే..
‘‘ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బుధవారం తెల్లవారుజామున టేకాఫ్ అయింది. ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలోని ఒక ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పైలెట్ విమానంపై పట్టు కోల్పోయాడు. మంటలు పెరిగిపోయాయి. దీంతో విమానం వేగంగా భూమిని ఢీకొట్టింది” అని ఇరాన్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ స్పోక్స్‌పర్సన్ ఖస్సేం బినియజ్ తెలిపారు. ఎయిర్‌పోర్టుకు 45 కిలోమీటర్ల దూరంలో షహ్రియర్ కౌంటీలోని ఖలాజ్ అబాద్లోని వ్యవసాయ భూమిలో కూలిపోయిందని చెప్పారు. ఎయిర్‌పోర్టు నుంచి 6.10కి విమానం టేకాఫ్ అయిందని.. రెండు నిమిషాల తర్వాత రాడార్ పరిధి నుంచి కనిపించకుండా పోయిందని అధికారులు చెప్పారు. విమానం ఆ సమయంలో 2,400 మీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు.
దర్యాప్తుకు టీమ్
ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ఒక బృందాన్ని నియమించామని ఉక్రెయిన్ ప్రభుత్వం చెప్పింది. ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే విమానం కూలిపోయింది. ఈ నేపథ్యంలో విమానం ప్రమాదానికి, ఇరాన్–అమెరికా గొడవకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఒమన్ పర్యటనకు వెళ్తున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లొదిమిర్ జెలెంస్కీ.. మధ్యలోనే వెనక్కి బయల్దేరారు. ప్రమాదంలో మరణించిన వారి బంధువులు, స్నేహితులకు సంతాపం తెలిపారు.
82 మంది ఇరాన్ పౌరులు
ప్రయాణికుల్లో 82 మంది ఇరాన్, 63 మంది కెనడా సిటిజన్స్ఉన్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వాదిమ్ ప్రిస్తెయికో ట్వీట్ చేశారు. 11 మంది ఉక్రెయిన్, 10 మంది స్వీడన్, నలుగురు ఆఫ్గన్, ముగ్గురు జర్మన్, ముగ్గురు బ్రిటన్ పౌరులు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల్లో 81 మంది మహిళలు, 15 మంది పిల్లలు ఉన్నారు. డెడ్ బాడీలను తరలించేందుకు 500 మెడికల్ యూనిట్లు ఘటనాస్థలిలో ఉన్నాయని అధికారులు చెప్పారు.
బోయింగ్‌తో తరచూ ప్రమాదాలు
బోయింగ్ 737–-800.. 1997లో మొదలైంది. ఇది బోయింగ్ 737 మ్యాక్స్కన్నా పాత మోడల్. రెండు ఇంజిన్ల జెట్‌లైనర్. చిన్న, మధ్య తరహా విమానాల కోసం ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్స్ వేలాదిగా ఈ విమానాలను వాడుకుంటున్నాయి. కొన్నేళ్లుగా ఈ విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. 2016 మార్చిలో రష్యాలోని రోస్తోవ్ ఆన్ డాన్ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో 62 మంది చనిపోయారు. 2010లో మంగళూరు ప్రమాదంలో 150 మందికిపైగా చనిపోయారు
