యానిమేషన్‌ కంపెనీని తగలబెట్టాడు.. 33మంది మృతి

యానిమేషన్‌ కంపెనీని తగలబెట్టాడు.. 33మంది మృతి

టోక్యో: జపాన్‌‌ క్యోటో సిటీలోని ఒక యానిమేషన్‌‌ కంపెనీకి గుర్తుతెలియని వ్యక్తి గురువారం నిప్పుపెట్టాడు. ఈ ప్రమాదంలో 33 మంది చనిపోయారు. మరో 36 మంది గాయపడ్డారు, వారిలో 10 మంది పరిస్థితి సీరియస్‌‌గా ఉంది.

గుర్తు తెలియని, మండే స్వభావం ఉన్న లిక్విడ్‌‌ను పోసి నిప్పు పెట్టాడని పోలీసులు చెప్పారు. తక్కువ టైంలోనే మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయన్నారు. బిల్డింగ్‌‌ మొత్తం పొగ కమ్ముకుపోవటంతో చాలా మంది ఊపిరి అందక చనిపోయారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్‌‌‌‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. చనిపోయినవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఫైర్‌‌‌‌ అధికారులు చెప్పారు. దుండగుడు ఉద్దేశపూర్వకంగానే నిప్పుపెట్టాడని, దాని వెనుక గల కారణం ఇంకా తెలియాల్సి ఉందని  టోక్యో పోలీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ అధికార ప్రతినిధి చెప్పారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు లోకల్‌‌ మీడియా చెప్పింది. బిల్డింగ్‌‌ చుట్టూ గ్యాసోలిన్‌‌ లాంటి పదార్థాన్ని పోసి నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో స్థానికులు భయంతో వణికిపోయారు. రెండుసార్లు పెద్ద శబ్దాలు వినిపించాయని, బాంబులు పేలాయని భయపడ్డామని స్థానికులు చెప్పారు. చూస్తుండగానే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయని ఒకామె చెప్పింది.