15 ఏండ్లలో 41.5 కోట్ల మంది ఇండియన్లు పేదరికం నుంచి బయటపడ్డరు

15 ఏండ్లలో 41.5 కోట్ల మంది ఇండియన్లు పేదరికం నుంచి బయటపడ్డరు
  • యునైటెడ్ నేషన్స్ డెవలప్‌‌మెంట్ ప్రోగ్రామ్ రిపోర్టు
  • 25 దేశాలు పావర్టీ ఇండెక్స్‌‌ను సగానికి తగ్గించాయి 
  • 110 దేశాల్లోని 110 కోట్ల మందికిపైగా తీవ్ర పేదరికంలో ఉన్నట్లు వెల్లడి

యునైటెడ్ నేషన్స్: పేదరికాన్ని పారదోలడంలో ఇండియా గణనీయమైన అభివృద్ధి సాధించిందంటూ యునైటెడ్‌‌ నేషన్స్‌‌ ప్రశంసలు కురిపించింది. 2005 -–06 నుంచి 2019 - 21 వరకు గత 15 ఏండ్లలో 41.5 కోట్ల మందిని పేదరికం నుంచి ఇండియా బయటపడేసిందని వెల్లడించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌‌డీపీ), ఆక్స్‌‌ఫర్డ్ పావర్టీ, హ్యూమన్ డెవలప్‌‌మెంట్ ఇనిషియేటివ్ (ఓపీహెచ్‌‌ఐ) తాజాగా గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌‌(ఎంపీఐ)ను రిలీజ్ చేశాయి. ‘‘గత 15 ఏళ్లలో ఇండియా సహా 25 దేశాలు ఎంపీఐని సగానికి తగ్గించాయి. వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. ఈ లిస్ట్​లో కాంబోడియా, చైనా, హోండురస్, ఇండోనేసియా, ఇండియా, మొరాకో, కాంగో, సెర్బియా, వియత్నాం దేశాలున్నాయి.  ముఖ్యంగా ఇండియా.. పేదరికాన్ని గణనీయంగా తగ్గించింది. కేవలం 15 ఏళ్లలోనే  415 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు’’ అని వివరించింది. ఇండియా సహా 19 దేశాలు ఎంపీఐ వాల్యూని సగానికి తగ్గించాయని, పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనని ఈ రిపోర్టు చెప్పింది.

55 నుంచి 16 శాతానికి..

ఇండియాలో 2005–06లో 55.1% పేదరికం ఉండగా.. 2019–21 నాటికి 16.4 శాతానికి పడిపోయిందని యూఎన్ రిపోర్టు వెల్లడించింది. ‘‘2005–06లో ఇండియాలో 64.5 కోట్ల మంది మల్టీడైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు. 2015–16 నాటికి పేదరికంలో ఉన్న వారి సంఖ్య 37 కోట్లకు.. 9019–21 నాటికి 23 కోట్లకు ఈ సంఖ్య తగ్గింది. అలానే.. భారతదేశంలో 2005–06లో 44.3 శాతంగా ఉన్న పేదలు న్యూట్రిషన్ ఇండికేటర్‌‌‌‌లో 2019 – 21 నాటికి 11.8 శాతానికి తగ్గారు. పిల్లల మరణాలు 4.5% నుంచి 1.5 % కి తగ్గాయి” అని వివరించారు. 110 దేశాల్లోని 610 కోట్ల మందిలో 110 కోట్ల మందికిపైగా తీవ్ర పేదరికంలో ఉన్నట్లు యూఎన్ రిపోర్టు తెలిపింది.  సబ్ సహారా ఆఫ్రికాలో 53.4 కోట్ల మంది, సౌత్ ఆసియాలో 38.9 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడ ప్రతి ఆరుగురిలో ఐదుగురు దుర్భర పరిస్థితిలోనే ఉన్నట్లు పేర్కొంది. మూడింట రెండొంతుల మంది పేదలు మిడిల్ ఇంకమ్ దేశాల్లో బతుకుతున్నారు.