న్యూడిల్లీ:ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన దాడిలో పాకిస్తాన్‌కు చెందిన టెర్రర్ గ్రూప్ జైషే -మొహమ్మద్ (జేఎం)కు సంబంధం ఉందని యునైటెడ్ నేషన్స్ కౌంటర్ -టెర్రరిజం మానిటరింగ్ టీమ్ వెల్లడించింది. ఈ సంస్థ టెర్రరిజంలో కొత్త వ్యూహాలు అవలంబిస్తోందని, మహిళల కోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసుకుందని ఆందోళన వ్యక్తం చేసింది.
యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కు సమర్పించిన నివేదిక ప్రకారం.."గతేడాది నవంబర్ 9న ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన కార్ బాంబు పేలుడులో 15 మంది మరణించారు. ఈ ఘటనతో జైషే మొహమ్మద్‌కు సంబంధం ఉన్నట్లు ఓ సభ్య దేశం మాకు నివేదించింది. జైషే చీఫ్, అంతర్జాతీయ టెర్రరిస్ట్ మసూద్ అజార్ గతేడాది అక్టోబర్ 8న 'జమాత్ ఉల్-ముమినత్' పేరుతో ఓ ప్రత్యేక మహిళా విభాగాన్ని అధికారికంగా ప్రకటించాడు.
ఉగ్రవాద దాడులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఇది చాలా ఆందోళనకర పరిణామం" అని పేర్కొంది. అల్-ఖైదాకు అనుబంధ సంస్థ అయిన జైషే.. సుదీర్ఘ కాలంగా భారతదేశంపై, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలను కొనసాగిస్తున్నదని నివేదిక వివరించింది.
2000లో స్థాపించిన ఈ సంస్థ.. భద్రతా దళాలు, పౌరులే లక్ష్యాంగా దాడులకు తెగబడుతున్నదని ఆరోపించింది. కొన్ని దేశాలు జైషేను క్రియాశీలంగా ఉన్న ప్రమాదకార సంస్థగా పేర్కొనగా, మరొక సభ్య దేశం ఆ సంస్థ ప్రస్తుతం పనిచేయడం లేదని టీమ్ కు తెలిపాయి.
