
ఇప్పటికీ ఎన్నో స్కూళ్లలో పిల్లలు కూర్చునేందుకు సరైన బెంచీలు లేవు. ఎంతోమంది వీపులు వంగిపోతున్నా ఇబ్బంది పడుతూ నేలపై కూర్చుని చదువుకుంటున్నారు. మరో వైపు.. ప్రజలు ఫర్నిచర్ తయారీకి ఏటా సుమారు ఎనిమిది నుంచి 13 మిలియన్ క్యూబిక్ మీటర్ల కలపను ఉపయోగిస్తున్నారు. అందుకోసం చెట్లను విపరీతంగా నరికేస్తున్నారు. ఈ రెండు సమస్యలకు ఒకే పరిష్కారాన్ని తీసుకొచ్చారు ‘అన్‌వుడ్’ ఫౌండర్లు. ప్లాస్టిక్ వేస్ట్‌తో బెంచీలు తయారు చేసి ఎన్‌జీవోలతో కలిసి వాటిని స్కూళ్లకు అందిస్తున్నారు.
పెరుగుతున్న ఫర్నిచర్ డిమాండ్‌ను తీర్చాలనే తపనతో మనం చెట్లను నరుకుతూ పోతున్నాం. జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడం, వాతావరణాన్ని కాపాడడం, అడవులను రక్షించడం మనందరి బాధ్యత. కానీ.. దానికి కట్టుబడి ఉండేవాళ్లు చాలా తక్కువ. మరోవైపు చెత్తకుండీలు ప్లాస్టిక్ వేస్ట్‌తో నిండిపోతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వేస్ట్ డ్రెయిన్‌లను మూసివేస్తోంది.
అందుకే అలాంటి వేస్ట్‌ని ఎలాగైనా రీసైకిల్ చేయాలి అనుకున్నాడు మెకానికల్ ఇంజనీర్ విశాల్ మెహతా. అతని ఆలోచనకు సైంటిస్ట్ బాబు పద్మనాభన్ ఇన్నొవేషన్ తోడయ్యింది. దాంతో ఇద్దరూ కలిసి ‘అన్‌వుడ్’ అనే స్టార్టప్ పెట్టారు. దాని ద్వారా ఎందుకూ పనికిరాని ప్లాస్టిక్‌ను అందరికీ అవసరమయ్యే బలమైన కలప లాంటి పదార్థంగా మారుస్తున్నారు.
పరిష్కరించలేని సమస్య
అన్‌వుడ్‌ను స్థాపించడానికి ముందు విశాల్ 17 సంవత్సరాలకు పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పునరుత్పాదక ఇంధన రంగంలో పనిచేశాడు. అప్పుడే అతనికి మనిషి చేసే అనేక పనుల వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిసింది. వాటి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. రీసైకిల్ చేయడానికి ముందుకు రావడం లేదు.
చిప్స్, బిస్కెట్లు, కిరాణా సామాన్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు, డెలివరీ బాక్స్‌లకు చుట్టే పలుచని ప్లాస్టిక్.. లాంటి తక్కువ విలువ చేసే ప్లాస్టిక్‌లు చాలా మురికిగా ఉంటాయి. పైగా చెత్తలో వేసేటప్పుడు అన్నీ కలగలుపుతారు. అలాంటివాటిని రీసైకిల్ చేయడం ఎలా అని రీసెర్చ్ చేస్తే.. అది చాలా కష్టమని తెలిసింది” అని చెప్పుకొచ్చాడు విశాల్.
అసాధ్యాన్ని సుసాధ్యం
బాబు కెరీర్‌లో ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్ కోసం కొన్ని వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో పనిచేశాడు. స్టీర్ వరల్డ్ అనే కంపెనీ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత భూమిపై అతిపెద్ద పర్యావరణ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ మీద దృష్టిపెట్టాడు. చివరికి ఒక ప్రక్రియను కనుగొన్నాడు. అందుకే ఆయనతో కలిసి ‘అన్‌వుడ్’ ఏర్పాటు చేశాడు విశాల్. డాక్టర్ బాబు కనిపెట్టిన ప్రక్రియ ప్రధానంగా పరమాణు పరస్పర చర్యల చుట్టూ తిరుగుతుంది.
ఈ పదార్థాన్ని డెవలప్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని పరికరాలను కూడా తయారుచేశాడు. ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషించే ‘ఇంటిగ్రేటెడ్ కాంపౌండింగ్ ఇంజిన్’ని 2016లోనే తయారుచేశాడు. ఆ తర్వాత ఈ మెటీరియల్ కోసం ఫార్ములా రెడీ చేశాడు. ‘‘కరోనా టైంలో పీపీఈ కిట్ల వ్యర్థాల సమస్య విపరీతంగా పెరిగింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు వుడ్ లాంటి ఈ పదార్థాన్ని తయారుచేశా. దీన్ని సాంకేతికంగా ‘మ్యాక్రో మాలిక్యులర్ ఫైబర్ మ్యాట్రిక్స్’(ఎంఎంఎఫ్‌ఎం) అంటారు”అని చెప్పుకొచ్చాడు డాక్టర్ బాబు.
ఎలాంటి చెత్తతో..
సాధారణంగా పార్టీలు జరిగిన చోట ప్లాస్టిక్ రేపర్లు, విరిగిన ప్లాస్టిక్ కత్తులు, ఫుడ్ ప్లేట్స్ పేరుకుపోతాయి. అందులో అనేక రకాలు ప్లాస్టిక్‌లు ఉంటాయి. సంప్రదాయ పద్ధతిలో రీసైకిల్ చేయాలంటే ముందుగా వాటిని వేరుచేయాలి. ఆ తర్వాత ప్రతిదీ బాగా కడిగి, ఆపై హై టెంపరేచర్‌లో కరిగించాలి. అందుకోసం చాలా పవర్ అవసరం అవుతుంది. ఖర్చు కూడా ఎక్కువే. పైగా ఆ ప్లాస్టిక్‌లో ఎక్కువ భాగం మళ్లీ వేస్ట్‌గా మారుతుంది. కానీ.. ఎంఎంఎఫ్‌ఎం తయారుచేయడానికి ఇంతలా శ్రమపడాల్సిన అవసరం లేదు.
ఇది ఒక మ్యాజిక్ రెసిపీ లాంటిది. అన్ని రకాల ప్లాస్టిక్‌లను ఒక శక్తివంతమైన యంత్రం(బ్లెండర్)లో వేస్తారు. అది అన్నింటినీ చిన్న ముక్కలుగా గ్రైండ్ చేస్తుంది. ఆ తర్వాత అదంతా స్మార్ట్ మిక్సర్‌లోకి వెళ్తుంది. అక్కడ దానికి డాక్టర్ బాబు పేటెంట్ పొందిన ఒక ప్రత్యేకమైన విధానంలో నేచురల్ ఫైబర్ యాడ్ అవుతుంది.
దాంతో అచ్చం చెక్కలా కనిపించే ఒక పదార్థం తయారవుతుంది. ఈ పదార్థంతో వివిధ సైజుల్లో బలమైన, మన్నికైన అన్‌వుడ్ బోర్డులు తయారుచేస్తారు. అవి తేమ, వేడి నిరోధకతను కలిగి ఉంటాయి. వాటిని టేబుళ్లు, కుర్చీలు, తలుపులు చేయడానికే కాదు గోడలు నిర్మించడానికి కూడా వాడుకోవచ్చు.
ఎవరూ కొనలేదు
‘‘ప్రజలకు మా ఆలోచన నచ్చింది. కానీ.. మా ప్రొడక్ట్స్‌ని కొనడానికి ఎవరూ ఇష్టపడలేదు. మేం తయారుచేసిన కొత్త పదార్థాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొదట్లో అన్‌వుడ్ నుంచి బోర్డులు మాత్రమే అమ్మాలి అనుకున్నాం. వాటితో బెంచీలు, కుర్చీలు లాంటివి తయారు చేసుకుంటారు అనుకున్నాం. కానీ.. అప్పటివరకు ఎవరికీ తెలియని పదార్థం కావడంతో ఎవరూ దాన్ని కొనే రిస్క్ తీసుకోలేదు. అందుకే మేమే ప్రొడక్ట్స్‌ని తయారుచేయాలని నిర్ణయించుకున్నాం. అలా అన్‌వుడ్ ‘అవుట్‌డోర్ ఫర్నిచర్ బ్రాండ్’గా మారింది” అని చెప్పుకొచ్చాడు విశాల్.
ఎలా తయారు చేస్తారు?
నగరాల్లోని మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ నుంచి శుభ్రమైన ప్లాస్టిక్ సాధారణ రీసైక్లర్లకు వెళ్తుంది. కానీ.. మురికిగా కలగలిపి లేయర్లుగా ఉన్న ప్లాస్టిక్‌ను పక్కన పడేస్తారు. సరిగ్గా అలాంటి చెత్తనే అన్‌వుడ్ సేకరిస్తుంది. అలాంటి అర కిలో ప్లాస్టిక్‌తో ఒక కిలో కలప వాడకాన్ని తగ్గించవచ్చు. 44,000 చిప్స్ ప్యాకెట్లతో తయారుచేసిన బోర్డ్‌లు ఒక పెద్ద చెట్టుని నరికితే వచ్చే కలపకు సమానం. అన్‌వుడ్ తయారుచేసిన బెంచీలు, కుర్చీలు, రెయిలింగ్‌లు, ఫెన్సింగ్‌లు ఇప్పుడు మార్కెట్‌లో బాగా అమ్ముడవుతున్నాయి.
ఉక్కు తుప్పు పడుతుంది. సిమెంట్‌కు పగుళ్లు ఏర్పడతాయి. తేమ వల్ల కలప ఉబ్బుతుంది. ఎండలో ప్లాస్టిక్ విరిగిపోతుంది. ఈ సమస్యలన్నింటికీ అన్‌వుడ్ బోర్డ్‌లతో చెక్ పెట్టొచ్చు. కంపెనీని అధికారికంగా 2025 ఏప్రిల్‌లో స్థాపించారు. అన్‌వుడ్ ఇప్పటికే 10 మెట్రిక్ టన్నులకు పైగా ప్లాస్టిక్ వేస్ట్‌ని రీసైకిల్ చేసి ఎన్నో చెట్లను కాపాడింది.
అనుకోకుండా పరిష్కారం
విశాల్ 2021లో ఒక కార్యక్రమంలో అనుకోకుండా ఇంజనీర్, ఇన్నోవేటర్, మెటీరియల్స్ సైంటిస్ట్ అయిన డాక్టర్ బాబు పద్మనాభన్‌ను కలిశాడు. ఆయన చాలా రోజులుగా ప్లాస్టిక్ వేస్ట్ రీసైకిల్ చేయడంపై రీసెర్చ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఒకరికొకరు వాళ్ల లక్ష్యాల గురించి చెప్పుకున్నారు.
అప్పుడే సైంటిస్ట్ బాబు తన ప్రయోగశాలలో సృష్టించిన ఒక చెక్కలా కనిపించే పదార్థాన్ని చూపించి ‘‘దీన్ని పూర్తిగా ప్లాస్టిక్‌తో తయారుచేశాం’’ అని విశాల్‌కు చెప్పాడు. అతనికి ఆ ఐడియా చాలా నచ్చింది. దాంతో ఇద్దరూ కలిసి స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
బెంచెస్ ఫర్ చేంజ్
ఎన్నో స్కూళ్లలో లక్షలాదిమంది పిల్లలు ఫ్లోర్ మీద కూర్చుని చదువుకుంటున్నారు. అది వాళ్ల ఆరోగ్యం, అభ్యాసాన్ని ఎంతో ప్రభావితం చేస్తోంది. ఆ పరిస్థితిని మార్చేందుకు అన్‌వుడ్ ముందుకొచ్చింది. ‘‘బెంచెస్ ఫర్ చేంజ్” కార్యక్రమం ద్వారా కార్పొరేట్స్, ప్రభుత్వేతర సంస్థలు, దాతలతో కలిసి స్కూళ్లకు రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసిన దృఢమైన బెంచీలను అందిస్తోంది.
ఇప్పటికే కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లోని నాలుగు స్కూళ్లకు 230 బెంచీలను అందించారు. మరో 26 స్కూళ్లకు ఇప్పుడు అందిస్తున్నారు. దేశంలోని అన్ని మారుమూల స్కూళ్లకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నీలమంగళలోని మంజునాథ బాలికల ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ ‘‘అన్‌వుడ్ అందించిన కొత్త బెంచీలు స్టూడెంట్స్‌కు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. మాకు 50 బెంచీలు వచ్చాయి” అని చెప్పాడు.