రాజకీయంగా ఎదుర్కోలేక‌ నాపై‌ దుష్ప్రచారం చేశారు : రాజగోపాల్ రెడ్డి

రాజకీయంగా ఎదుర్కోలేక‌ నాపై‌ దుష్ప్రచారం చేశారు : రాజగోపాల్ రెడ్డి

సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ‌ లిక్కర్ స్కాంలో త్వరలోనే జైలు పాలవ్వక తప్పదని బీజేపీ‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.‌ ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజగోపాల్ రెడ్డి.. మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా..  ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.  ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అన్నదమ్ములుగా కలిసి‌ ఉండేలా ఆ తిరుమల శ్రీవాలు ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ ప్రజలకు వ్యతిరేకత ఉందనేది మునుగోడు ఎన్నికల్లోనే కేసిఆర్ కి తెలిసిందన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక కౌరవ సైన్యం వచ్చి ప్రతి గ్రామానికి ఒక మంత్రి, అధికారి‌ వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచిన విషయం కూడా కేసీఆర్ కు పూర్తిగా అర్థం అయ్యిందని చెప్పారు. ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేసేందుకు, బీఆర్ఎస్ పార్టీ అనే కొత్త డ్రామాకు కేసీఆర్ తెర తీశారని విమర్శించారు. 

నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తున్నట్లు కేసీఆర్ నాటకం ఆడి ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేశారని అందరికీ తెలుసని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, ఒక కుటుంబ పాలన, నియంత పాలన కొనసాగుతుందన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ప్రజలకు, పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. అందులో భాగంగానే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నాయకత్వంలోనే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చని నిర్ణయం తీసుకుని కేసిఆర్ కి వ్యతిరేకంగా యుద్దం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలోనే కాకుండా యావత్ తెలుగు ప్రజలంతా నైతికంగా రాజగోపాల్ రెడ్డి, బీజేపీ గెలిసిందని సంతోషపడ్డారని చెప్పారు. పది వేల ఓట్లతో కేసీఆర్ గెలిచినా సంతోషం లేదన్నారు. రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం తెలంగాణలో బీజేపీ విజయం సాధించి, ప్రభుత్వంను నడిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన నిజమైన అమరవీరులకు నిజమైన నివాళి అందించాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలన్నారు. తన యాభై ఐదు ఏళ్ళ జీవితంలో డబ్బు కోసం తాను వెళ్ళలేదని, రాజకీయంగా ఎదుర్కోలేక‌ తనపై‌ కేసీఆర్ దుష్ప్రచారం చేశారని ఆరోపించారు.