
భీమదేవరపల్లి, వెలుగు: మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకున్న లోన్ డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక మనోవేదనతో యువకుడు చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన మాడుగుల కిరణ్(35) భవన నిర్మాణ రంగంలో మేస్త్రీ పని చేస్తున్నాడు. ఇటీవల ఐదు మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి రూ. 3 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. కిరణ్ తో పాటు భార్య రుచిత కూలీ పనులకు వెళ్తూ అప్పులు చెల్లించేవారు. ఓ భవనంలో పని చేస్తుండగా కిరణ్ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అప్పటి నుంచి పని చేయలేకపోతున్నాడు.
రెండు, మూడు కిస్తీలు కట్టకుంటే ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడతారని కిరణ్ తన భార్య రుచితకు చెప్పి తల్లిగారింటికి డబ్బుల కోసం పంపాడు. శుక్రవారం ఉదయం ఆమె ఫోన్ చేయగా కిరణ్ లిఫ్ట్ చేయలేదు. దీంతో చుట్టుపక్కల వారికి సమాచారం అందించగా, కిరణ్ మంచంపై చనిపోయి ఉన్నాడు. కిస్తీలు ఎలా కట్టాలన్న టెన్షన్‌తో తన భర్త చనిపోయాడని రుచిత కన్నీరుమున్నీరైంది. కిరణ్‌కు కొడుకు ప్రజ్ఞ, కూతురు నైనిక ఉన్నారు. కిరణ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరారు.