ఫామ్ వెంచర్లలో రోడ్లకూ రిజిస్ట్రేషన్ల ముప్పు

ఫామ్ వెంచర్లలో రోడ్లకూ రిజిస్ట్రేషన్ల ముప్పు
  • భూరికార్డుల ప్రక్షాళనలో పీఆర్, ఆర్​అండ్​బీ, ఎన్​హెచ్ భూములకు పాస్​బుక్స్ జారీ
  • ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ సేత్వార్ రెడీ చేయని ఆఫీసర్లు
  • రోడ్ల పట్టాలతో ఇతరుల భూముల్లోకి అక్రమార్కులు
  • ధరణి వచ్చాక ఫామ్ వెంచర్​లో రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో ఆరేండ్ల కింద జరిగిన భూరికార్డుల ప్రక్షాళనలో కొందరు రెవెన్యూ ఆఫీసర్లు చాలా చోట్ల రోడ్లకు కూడా పట్టా చేసి పాస్ బుక్స్ జారీ చేశారు. భూ రికార్డుల్లో రోడ్లను కూడా వ్యవసాయ భూములుగా నమోదు చేశారు. ఇలాంటి వాటిలో గ్రామాల మధ్య ఉండే పంచాయతీ రాజ్ రోడ్లతో పాటు ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్ కు చెందిన భూములు కూడా ఉన్నాయి. ఇలా రోడ్డు విస్తీర్ణంతో పట్టాలు పొందిన వ్యక్తులు.. అదే సర్వే నంబర్ లో రోడ్డు పక్కనే ఉన్న వేరే వాళ్ల భూముల్లోకి ప్రవేశించి.. తమ భూమి ఇందులోనే ఉందంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. అందుకు ప్రూఫ్స్​గా పాస్ బుక్స్ చూపిస్తున్నారు. ఇరువర్గాల వద్ద పాసు పుస్తకాలు ఉండడంతో ఇలాంటి వివాదాలను పరిష్కరించలేక రెవెన్యూ ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు. ఎవరి భూమో తేల్చుకునేందుకు కోర్టులకు వెళ్లండని ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ తరహా వివాదాలపై కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి.

ధరణి పోర్టల్ వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వ్యవసాయ భూముల్లో అనధికార వెంచర్లు వేయడం, గుంటల చొప్పున అమ్మడం కామన్ అయింది. ఫామ్ ల్యాండ్స్ లో గుంట, రెండు గుంటల ప్లాట్లు కొనుగోలు చేస్తే రైతుబంధు, రైతు బీమా వర్తించడం, లేఔట్ ప్లాట్ల ధరతో పోలిస్తే సగానికన్నా తక్కువ రేటుకే ప్లాట్ దక్కుతుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఈ ప్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది తహసీల్దార్లు తమ వాటా తీసుకొని చాంతాడంత బై నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కానీ, ఇలాంటి ఫామ్ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్ లో చాలా ఇబ్బందులు తప్పవని రెవెన్యూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.