హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యూర్ పరిధిలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులకు రూ.2,654 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బడ్జెట్లో కోర్ అర్బన్ రీజియన్లో హెచ్ సిటీ పనులు మినహా ఎక్కడా కూడా మూడు కార్పొరేషన్ల ప్రస్తావన రాలేదు. జీహెచ్ఎంసీ విభజనకు ముందు రూ.9,700 కోట్లు కావాలని, ఇందులో జీహెచ్ఎంసీకి రూ.5 వేల కోట్లు, సీఎంసీ, ఎంఎంసీకి మిగతా రూ.4700 కోట్లు టాయించాలని అధికారులు కోరారు.
కానీ, సర్కారు బడ్జెట్లో కేవలం హెచ్ సిటీ పనులకు మినహా మిగిలిన ఏ ప్రాజెక్టుకు కేటాయింపులు చేయలేదు. 3 కార్పొరేషన్లలో హెచ్ సిటీ కింద రోడ్లు, ఫ్లైఓవర్లు, నాలాల నిర్మాణం కోసం నిధులు కేటాయించింది.
హెచ్ఎంఆర్ఎల్ కు రూ.1,100 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్కు ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించింది. మెట్రో నిర్వహణను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటున్న నేపథ్యంలో పాతబస్తీ, ఎయిర్‌పోర్ట్ కారిడార్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఫేజ్--2 విస్తరణకు రూ.600 కోట్లు కేటాయించింది. హెచ్ఎంఆర్ఎల్ ఆఫీసుల నిర్వహణ తదితర వాటి కోసం మిగతా రూ.500 కోట్లు కేటాయించింది. మరోవైపు, హైడ్రాకు రూ.111.48 కోట్లను రాష్ట్ర
ప్రభుత్వం కేటాయించింది.
