మన పాత బంగారం అమ్ముకుంటే వచ్చిన లాభానికి పన్ను కట్టాలా? పూర్తి వివరాలు

మన పాత బంగారం అమ్ముకుంటే వచ్చిన లాభానికి పన్ను కట్టాలా? పూర్తి వివరాలు

భారతీయ పన్ను చట్టాల ప్రకారం బంగారం ఒక క్యాపిటల్ అసెట్ కిందకు వస్తుంది. దీన్ని అమ్మటం వల్ల వచ్చే లాభంపై కచ్చితంగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. మీరు ఆభరాణాలను ఎంత కాలం ఉంచుకున్నారు.. వాటిని ఎప్పుడు కొనుగోలు చేశారనే దాని ఆధారంగా ఈ పన్ను లెక్కింపు మారుతుంది.

బంగారాన్ని విక్రయించే ముందు దాని హోల్డింగ్ పీరియడ్ చాలా ముఖ్యం:
1. లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్: బంగారాన్ని కొన్న 24 నెలల కంటే ఎక్కువ కాలం అంటే 2 ఏళ్లు దాటిన తర్వాత అమ్మితే అది లాంగ్-టర్మ్ అసెట్ అవుతుంది. దీనిపై ఎలాంటి ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా ఫ్లాట్ రేటు 12.5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

2. షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్: ఒకవేళ గోల్డ్ కొన్నాక హోల్డింగ్ పిరియడ్ 24 నెలల కంటే తక్కువ ఉంటే.. దానిని షార్ట్-టర్మ్ లాభంగా పరిగణిస్తారు. ఈ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి.. వర్తించే ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు.

కొనుగోలు ధరను ఎలా లెక్కించాలి?

పన్నుకు వర్తించే లాభాన్ని లెక్కించడానికి అమ్మిన రోజున వచ్చిన రేటు నుంచి అసలు కొనుగోలు ధరకు సంబంధించిన ఖర్చును మినహాయిస్తారు. ఒకవేళ ఆ బంగారం మీకు వారసత్వంగా వస్తే.. అసలు యజమాని చెల్లించిన కొనుగోలు ధరనే పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా ఏప్రిల్ 1, 2001 కంటే ముందే ఆ ఆభరాణాలు పొందినట్లయితే రిజిస్టర్డ్ వాల్యూయర్ నివేదిక ద్వారా ఆ తేదీ నాటి ఫెయిర్ మార్కెట్ వాల్యూను బేస్‌లైన్ కాస్ట్‌గా ఉపయోగించుకునే వెసులుబాటు పన్ను చెల్లింపుదారులకు ఉంటుంది. సో ప్రజలు తమ అవసరాల కోసం లేదా లాభాలను క్యాష్ చేసుకోవటానికి పాత బంగారం అమ్మితే దానిపై కూడా ఖచ్చితంగా పన్ను కట్టాల్సి ఉంటుందని మర్చిపోవద్దు.