తప్పుడు ప్రశ్నలతోనే ఎస్సై, కానిస్టేబుల్ పాస్ పర్సంటేజీ తగ్గింది

తప్పుడు ప్రశ్నలతోనే  ఎస్సై, కానిస్టేబుల్  పాస్ పర్సంటేజీ తగ్గింది

ఎస్సై, కానిస్టేబుల్‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌పై నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్‌‌‌‌

ముషీరాబాద్, వెలుగు: పోలీస్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్షలో తప్పుడు ప్రశ్నలు, అవకతవకలు జరగడం వల్లే అభ్యర్థుల పాస్‌‌‌‌ పర్సంటేజీ తగ్గిందని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్‌‌‌‌ అన్నారు. 7 లక్షల మంది రాసిన ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాల్లో పాస్‌‌‌‌ పర్సంటేజీ 50 శాతం కూడా దాటలేదని, 31 శాతం మాత్రమే వచ్చిందన్నారు. ఒక్కో పోస్టుకు 12 మంది అభ్యర్థులను మాత్రమే తీసుకున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్షల్లో వచ్చిన తప్పుడు ప్రశ్నలపై చర్చించేందుకు సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌‌‌‌కు తరలించారు. అనంతరం నీల వెంకటేశ్‌‌‌‌ మాట్లాడుతూ, ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్షలో తప్పుడు ప్రశ్నలు, అవకతవకలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంగ్‌‌‌‌ క్వశ్చన్స్‌‌‌‌కు 22 మార్కులు కలపాలని, క్వాలిఫై అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అభ్యర్థుల హాల్ టికెట్ల నంబర్లను క్వాలిఫై లిస్టులో పెట్టాలన్నారు. మల్టీపుల్ ఆన్సర్స్‌‌‌‌ ఉన్న ప్రశ్నలు తొలగించి మార్కులు కలపాలని, తర్వాత అభ్యర్థుల మార్కుల లిస్ట్ రిలీజ్ చేయాలని కోరారు. అలాగే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌‌‌‌కు కటాఫ్ మార్కులు 50 శాతం తగ్గించాలని డిమాండ్ చేశారు.