సొంతిల్లు సుదూరం.. చుక్కల్లో ఇండ్ల ధరలు.. ఈ ఏడాది 6.3 శాతం అప్

సొంతిల్లు సుదూరం.. చుక్కల్లో ఇండ్ల ధరలు.. ఈ ఏడాది 6.3 శాతం అప్
  • అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుదల
  • బడ్జెట్​ ఇండ్ల నిర్మాణమూ తక్కువే

న్యూఢిల్లీ: 
సొంతింటి కల సాకారం చేసుకోవడం నానాటికీ కష్టతరంగా మారుతోంది. మనదేశంలో ఇండ్ల ధరలు ఏటా అంచనా వేసిన దానికంటే వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం సంపన్న కొనుగోలుదారుల నుంచి వస్తున్న డిమాండ్. సామాన్యులు వీరితో పోటీ పడలేకపోతున్నారు. బడ్జెట్​ధరల ఇండ్ల సరఫరా తగ్గుతోంది. దీనివల్ల చాలా మంది అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తోంది. ఫలితంగా అద్దెలూ పెరుగుతున్నాయి. 

మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు కొన్ని నగరాల్లోనే ఉండటం, వేతనాలు పెరగకపోవడంతో చాలా మందికి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది.  ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ గత క్వార్టర్​లో 7.8 శాతం వృద్ధి సాధించినప్పటికీ,  ప్రయోజనాలు కొద్దిమందికి మాత్రమే అందుతున్నాయి. ఇది హౌసింగ్​ సెక్టార్​లోనూ కనిపిస్తోంది. ప్రీమియం ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండగా,  బడ్జెట్​ధరల ఇండ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.  

దేశంలో ప్రస్తుతం దాదాపు కోటి బడ్జెట్​ఇండ్ల కొరత ఉంది. 2030 నాటికి ఈ కొరత మూడు రెట్లు పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ సంస్థ అంచనా వేసింది. నగరాల్లో భూములు సంపన్నుల చేతుల్లో ఉన్నాయని, భరించగలిగే ధరల్లో ఇండ్ల నిర్మాణం సాధ్యం కాదని లియాసెస్ ఫోరస్ సంస్థకు చెందిన పంకజ్ కపూర్ అన్నారు

పదేళ్లలో డబుల్​

ఇండియాలో గత పదేళ్లలో ఇండ్ల ధరలు రెట్టింపు అయ్యాయి. 2024లో నాలుగు శాతం, ఈ ఏడాది 6.3 శాతం పెరిగాయి. వచ్చే ఏడాది ఏడు శాతం పెరుగుతాయని రాయిటర్స్ సర్వేలో 20 మంది ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనా జూన్​లో అంచనా వేసిన ఆరు శాతం కంటే ఇది ఎక్కువగా ఉంది. ఈ సర్వే ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 12 మధ్య జరిగింది.  

సగటు అద్దెలు వచ్చే ఏడాది 5 శాతం నుంచి 8 శాతం వరకు పెరుగుతాయని కొలియర్స్​ సీనియర్​ఎగ్జిక్యూటివ్​ అజయ్​శర్మ అంచనా వేశారు. ఇది వినియోగదారుల ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ. మొదటిసారి ఇల్లు కొనేవారికి స్థోమత గురించి అడిగినప్పుడు, 19 మంది ఎనలిస్టుల్లో పది మంది స్థోమత మెరుగుపడుతుందని చెప్పగా, తొమ్మిది మంది మాత్రం తగ్గుతుందని అన్నారు.  

వడ్డీ రేట్లు తగ్గినా..

ఆర్​బీఐ తన కీలక వడ్డీ రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50 శాతానికి తీసుకువచ్చినప్పటికీ, అది కొనుగోలు శక్తిని పెంచే అవకాశం లేదని నిపుణులు చెప్పారు. ఈరోస్ గ్రూప్ డైరెక్టర్ అవనీశ్​ సూద్ మాట్లాడుతూ, వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల హోం లోన్​ కిస్తీలు కాస్త తగ్గుతాయని, దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు 7 శాతం నుంచి 8 శాతం పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఎన్​సీఆర్,​ బెంగళూరు వంటి మార్కెట్లలో వేగంగా పెరుగుతున్నాయని అన్నారు. "మార్కెట్ ప్రీమియం లగ్జరీ ఇళ్ల వైపు ఎక్కువగా వెళ్తోంది. దీనివల్ల మొదటిసారి ఇల్లు కొనేవారు ఇబ్బందిపడుతున్నారు’’ అని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొద్ది శాతం మంది మాత్రమే చురుగ్గా ఉన్నారని కపూర్​అన్నారు.  ఆస్తి కొనేందుకు అర్హత వయసు 30–40 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు పెరిగిందని ఆయన చెప్పారు.    


‘‘అసలు సమస్య ఏంటంటే, మన ఎకానమీ బలపడుతున్నా,  ఫలాలు కింది స్థాయిలో ఉన్న ప్రజలకు అందడం లేదు.  వారి ఆదాయాలు అక్కడే ఆగిపోయాయి. ఈ ప్రజలు నగర ప్రాంతాల్లో ఇళ్లు కొనేందుకు ఆర్థిక స్థోమత లేక అద్దె ఇళ్ల మీద ఆధారపడుతున్నారు. ఎక్కువ మంది అద్దెకు ఉంటుండంతో  కిరాయిలూ పెరిగాయి’’

- అజయ్​శర్మ , కొలియర్స్​ సీనియర్ ​ఎగ్జిక్యూటివ్​