
- రూ. 29 కోట్లతో ఖమ్మం ఖిల్లా దగ్గర నిర్మాణ పనులు
- కోలకతాలో జరుగుతున్న టవర్స్ ఫ్యాబ్రికేషన్ వర్క్
- 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామంటున్న అధికారులు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం ఖిల్లాపై రోప్ వే కోసం భూ సేకరణ చిక్కులు తొలగిపోవడంతో ఇక నిర్మాణ పనులు స్పీడ్ అందుకోనున్నాయి. ఖిల్లా సమీపంలో ఇరుకుగా ఉండడంతో, రోప్ వే లోయర్ స్టేషన్ కోసం అవసరమైన భూసేకరణ పనులను ఇటీవల జిల్లా అధికారులు పూర్తి చేశారు. 9 ఇండ్లను ఖాళీ చేయించి, పూర్తిగా నేలమట్టం చేశారు. నిర్వాసితులకు రఘునాథపాలెం మండలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సమీపంలో ఇంటి స్థలాలను కేటాయించారు. ఇటీవల మరో నాలుగు ఇండ్లకు చెందిన వారు స్వచ్ఛందంగా తాము అక్కడి నుంచి వెళ్లిపోతామని, భూసేకరణ పరిహారం ఇప్పించాలని అధికారులను కోరారు.
దీనికీ అధికారులు ఓకే చెప్పారు. ఖమ్మంలో చారిత్రాత్మక ప్రాధాన్యమున్న ఖిల్లాను ఆనుకొని, టూరిస్ట్ ఎట్రాక్షన్ కోసం రోప్ వే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అర్బన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(టీయూఎఫ్ఐడీసీ), స్తంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) నిధులు రూ.29 కోట్లతో రోప్ వే నిర్మాణాన్ని చేపడుతున్నారు. కోల్ కతాకు చెందిన కన్వేయర్ అండ్ రోప్ వే సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది.
ఈ ఏడాది మార్చిలో అగ్రిమెంట్ కాగా, వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రోప్ వే కోసం సర్వే, సాయిల్ టెస్ట్ కూడా పూర్తి చేశారు. కోల్ కతాలోని వర్క్ షాప్ లో టవర్స్ ఫ్యాబ్రికేషన్ వర్క్ కూడా జరుగుతోంది. అక్కడ వాటిని తయారుచేసిన తర్వాత పార్టులుగా విడదీసి, ఖమ్మానికి తరలించి ఇక్కడ ఫిట్ చేయనున్నారు. ఈనెలాఖరు వరకు స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన సివిల్ వర్క్స్ ప్రారంభం కానుందని అధికారులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో కోల్ కతా నుంచి మ్యాన్ పవర్‌ను రప్పిస్తున్నారు. ముందుగా లోయర్ స్టేషన్ నిర్మాణం మొదలుపెడతారు. అది పూర్తయ్యే వరకు అప్పర్ స్టేషన్ కు సంబంధించిన మెటీరియల్ ను
రప్పించనున్నారు.
రెండు అంతస్తుల బేస్ స్టేషన్...
ఖమ్మం ఖిల్లా 30 మీటర్ల ఎత్తులో, మొత్తం 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. రోప్ వే ప్రాజెక్టులో రెండు అంతస్తుల బేస్ స్టేషన్, అప్పర్ స్టేషన్ ఉంటాయి. ఈ రెండు స్టేషన్ల మధ్య 230 మీటర్ల దూరం రోప్ వేను ఏర్పాటు చేస్తారు. రోప్ వే కు మొత్తం నాలుగు క్యాబిన్లు బిగిస్తారు. ఒక క్యాబిన్ లో ఒకేసారి ఆరుగురు కూర్చుని ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది మే నెలలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్రీ ఫేస్ కరెంట్ తో పాటు, మూడు పెత్త స్థాయి జనరేటర్లను కూడా బిగించనున్నారు.
ఖమ్మానికి టూరిస్ట్ ఎట్రాక్షన్ గా మారుతుంది
నిర్ణీత గడువులోగా రోప్ వే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. చారిత్రాత్మక ప్రాంతమైన ఖమ్మం ఖిల్లాను ఆనుకొని రోప్ వే నిర్మాణం పూర్తయితే మరింత మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. రోప్ వే నిర్మాణం పూర్తయిన తర్వాత పార్కింగ్ స్పేస్ కు ఇబ్బంది లేకుండా చూడడంతో పాటు, రోడ్ కనెక్టివిటి మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాం. వాహనాలు నేరుగా రోప్ వే దగ్గరకు వచ్చే అవకాశం ఉంటేనే టూరిస్టులు రావడానికి ఆసక్తి చూపిస్తారు. దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నాం. - తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి