ఇకపై వాళ్లు కూడా దర్జాగా బీర్ తాగొచ్చు.. లీగల్ ఏజ్ తగ్గించిన ప్రభుత్వం

ఇకపై వాళ్లు కూడా దర్జాగా బీర్ తాగొచ్చు.. లీగల్ ఏజ్ తగ్గించిన ప్రభుత్వం

ఆల్కహాల్ తాగడంలో ఏజ్ రిస్ట్రిక్షన్స్ విధిస్తుంటాయి ప్రభుత్వాలు.  మైనర్లు, పిల్లలు తాగి ఆరోగ్యం, చదువు పాడు చేసుకోకుండా ఉండేందుకు నిబంధనలు విధిస్తుంటాయి. బీర్ తాగే వయసు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం బీర్ తాగే వయసును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. చట్టపరమైన వయసును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 

బీర్ తాగే వయసును 21 ఏండ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం.  ఇప్పటి వరకు లీగల్ ఏజ్ దేశ రాజధానిలో 25 ఏండ్లుగా ఉంది. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఢిల్లీ చుట్టు పక్కన ఉన్న నగరాలలో బీర్ తాగే చట్టపరమైన వయసు 21 ఏళ్లుగా ఉంది. కానీ ఢిల్లీలో మాత్రం ఇప్పటి వరకు 25 ఏళ్ల లీగల్ వయసు ఉన్న వాళ్లను మాత్రమే బీర్ తాగేందుకు అనుమతిస్తున్నారు. పొరుగున ఉన్న పట్టణాల్లో వయసు తక్కువగా ఉండటం.. ఢిల్లీలో ఎక్కువగా ఉండటంతో కొన్ని సార్లు ఇబ్బందులు గురవుతున్నాయి. ముఖ్యంగా గుర్గాం, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ తదితర నగరాలలో 21 లీగల్ ఏజ్ 21 ఏండ్లు ఉండటంతో.. వాటికి అనుగుణంగా ఢిల్లీలో కూడా లేటెస్ట్ గా మార్పులు చేశారు. 

భారీగా పెరగనున్న ఎక్సైజ్ రెవెన్యూ: 

ప్రస్తుతం ప్రభుత్వాలకు మద్యం ద్వారా వచ్చే డబ్బు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారింది. అందుకోసం లీగల్ ఏజ్ ను తగ్గిస్తే మరింత ఆదాయం సమకూరుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఇప్పటి వరకు ఎక్సైజ్ రెవెన్యూ 8 వేల కోట్ల రూపాయలు వస్తోంది. ఈ నిర్ణయంతో రూ.12 వేల కోట్లకు చేరుకోనుందని అధికారులు చెబుతున్నారు. 

స్కూల్స్, హాస్పిటల్స్, గృహ సముదాయాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎక్సైజ్ కమీషనర్ తెలిపారు. మాల్స్, సూపర్ మార్కెట్లలో కూడా అమ్ముకునే సదుపాయం వ్యాపారులకు కల్పించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త పాలసీని మరో 3 నుంచి 4 నెలల్లో ఎక్సైజ్ కమిటీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు.