
- ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
- ఈ నెల 1న జీవో, నోటిఫికేషన్ జారీ.. అన్ని రకాల డాక్యుమెంట్లు, రిపోర్టులు కూడా అందజేత
- రాష్ట్ర సర్కార్ అడిగితే 48 గంటల్లోనే సీబీఐ విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటన
- సీబీఐ నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరా
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై సీబీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. దాదాపు 12 రోజులు గడుస్తున్నా అటు కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం గానీ, ఇటు ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో సీబీఐ సంప్రదింపులు జరపడం గానీ ప్రారంభించలేదు. ఈ అంశంపై ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై గత నెల 31న అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
దీనికి అనుగుణంగా.. సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ కాపీ తమకు అందినట్టు సీబీఐ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇచ్చింది. కానీ, ఆ తర్వాత నుంచి ఎలాంటి సమాధానం గానీ, దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం గానీ రాలేదు.
అన్ని ఆధారాలు అందజేత
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని.. ప్రాజెక్టులోని వివిధ దశల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని సీబీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. లేఖతో పాటే కాళేశ్వరం ప్రాజెక్టుకు
సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఘోష్ కమిషన్, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలను, ఇతర ఆధారాలను సీబీఐకి అందజేసింది. సాధారణంగా ఇలాంటి ప్రాధాన్యమున్న కేసుల దర్యాప్తు కోసం అభ్యర్థనలు వచ్చినప్పుడు సీబీఐ ప్రాథమిక పరిశీలన చేసి, దర్యాప్తుకు సంబంధించి ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతుంది. కానీ ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం గానీ, దర్యాప్తు మొదలుపెట్టినట్టు సమాచారం గానీ రాలేదు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ. ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946 ప్రకారం ఏర్పడింది.
ఈ చట్టం ప్రకారం ఏదైనా కేసును దర్యాప్తు చేయాలంటే సీబీఐకి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంగీకారం (కన్సెంట్) అవసరం. రాష్ట్రంలోకి సీబీఐ రాకపై గత బీఆర్ఎస్ సర్కారు నిషేధం విధించింది. దీంతో హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో లేదంటే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌గా ఏదైనా కేసుకు మినహాయింపు ఇచ్చినప్పుడు మాత్రమే సీబీఐ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో పలు అంతర్రాష్ట్ర అంశాలు ముడిపడి ఉండటం, వాటి నిర్మాణంలో అనేక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, సంస్థలు పాలుపంచుకోవడంతో కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పైగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలతో సహా ఈ కేసులో నిందితులందరిపై దర్యాప్తు చేపట్టేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది.
నోటిఫై చేయని కేంద్రం
సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, దర్యాప్తును ప్రారంభించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ ప్రక్రియ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946 ప్రకారం జరుగుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించినా లేదా జనరల్ కన్సెంట్ ఉన్నా కూడా ఒక నిర్దిష్ట కేసును సీబీఐ దర్యాప్తు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక నోటిఫికేషన్ అవసరం అవుతుందని అధికారులు చెప్తున్నారు.
కానీ ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోసం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. కేంద్రం నోటిఫై చేసిన తరువాత అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎంక్వైరీ మొదలుపెట్టే అవకాశముందని అధికారులు అంటున్నారు.
లీగల్‌గా అడ్డుకోవడంపై బీఆర్ఎస్ ఫోకస్
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో పాటు ఇతర ఏ కేసులు వచ్చినా వాటిని ప్రాథమిక దశలోనే అడ్డుకునేందుకు బీఆర్ఎస్పార్టీ ఎప్పటికప్పుడు లీగల్ఒపీనియన్స్తీసుకుంటూ ముందుకు పోతున్నది. మొదట పీసీ ఘోష్కమిషన్నివేదిక విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు మెట్లెక్కిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు.. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సీబీఐ ఎంక్వైరీ చేయవద్దని కోరి ఆ మినహాయింపును పొందారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ఆధారంగానే సీబీఐ ఎంక్వైరీకి అభ్యర్థిస్తున్నట్లు కోర్టుకు వెల్లడించింది. ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీని ఎలా అడ్డుకోవాలనే దానిపై కేసీఆర్మంతనాలు చేస్తున్నట్టు తెలిసింది. ఫార్మూలా–ఈ రేస్‌కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ అడ్డంగా బుక్‌చేసింది. ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రోకో జరిగినట్టు పక్కా ఆధారాలతో ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ విషయంలో బీఆర్ఎస్‌లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
ఈ కేసులో కేసీఆర్, హరీశ్‌రావు ప్రధానంగా ఉండటంతో వారి అరెస్టుల్లాంటివి జరిగితే పార్టీ క్యాడర్అస్తవ్యస్తం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో సీబీఐ ఎంక్వైరీని ఆపేందుకు ఆ పార్టీ పెద్దలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్చేసే అవకాశం లేకపోలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.