
-
ప్రాసెసింగ్‌లో మరో 10 లక్షలు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: స్వయం సహాయక గ్రూపు (ఎస్ హెచ్‌జీ) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఇందిరమ్మ చీరలు రెడీ అయ్యాయి. ఇందిరా మహిళా శక్తి స్కీం కింద మహిళా సంఘాల సభ్యులకు ఒక్కో చీర ఇవ్వాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు చీరల ఆర్డర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. ఏడాదంతా పని కల్పించాలన్న ఉద్దేశంతో 4.30 కోట్ల మీటర్ల క్లాత్ ఉత్పత్తి చేయాలని నేతన్నలకు ఆర్డర్ అప్పగించింది. దాదాపు 6 నెలలు కష్టపడి సిరిసిల్ల నేతన్నలు ఇందిరమ్మ చీరలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు 35 కోట్ల మీటర్ల క్లాత్ నెయ్యడం పూర్తయింది.
ప్రాసెసింగ్ తో సహా దాదాపు 50 లక్షల చీరల ఉత్పత్తి కంప్లీట్ అయింది. 10 లక్షల చీరలు ప్రాసెసింగ్ లో ఉండగా.. మరో 5 లక్షల చీరలు లూమ్స్ పై నుంచి ప్రొక్యూర్ స్టేజ్‌కు వచ్చాయి. చీరల ప్రొక్యూర్‌మెంట్ కోసం ఈ నెల 15 వరకు గడువు ఉండగా.. దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించారు.
సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే సెర్ప్, మెప్మా సంస్థలు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేశాయి. ఈ నెల 23 నుంచి చీరల పంపిణీ జరగనున్నది. సీఎం రేవంత్ రెడ్డి, ఆయా జిల్లాల్లో మంత్రులు చీరల పంపిణీ ప్రారంభించనున్నారు. పూర్తయిన చీరలను టెస్కో ఆఫీసర్లు ఆయా జిల్లాలకు పంపిస్తున్నారు. గతంలో బతుకమ్మ చీరలు రేషన్ కార్డుల ఆధారంగా చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయగా.. ఇందిరమ్మ చీరలను ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌ల ద్వారా అందించనున్నారు.
లైట్ బ్లూ చీర.. డార్క్ బ్లూ బార్డర్
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర రావు, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ఎంపిక చేసిన డిజైన్‌లో చీరలను తయారు చేశారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఇస్తున్న చీరలు లైట్ బ్లూ కలర్ తో.. డార్క్ బ్లూ బార్డర్‌తో రూపొందించారు. బ్లూ కలర్ తో ఉన్న చీర మీద వైట్ కలర్ పువ్వులను ముద్రించారు. బ్లౌజ్‌తో కలిపి 6.3 మీటర్ల చీరను మహిళలకు ఇవ్వనున్నారు. వృద్ధ మహిళలకు బ్లౌజ్ తో కలిపి 9 మీటర్ల చీర ఇస్తున్నారు. ఒక్కో చీర తయారీకి దాదాపు రూ.800 వరకు ఖర్చయినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.
క్వాలిటీగా తయారు చేసినం
ఇందిరమ్మ చీరల ఉత్పత్తి చివరి దశకు చేరింది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల చీరల తయారీ పూర్తయ్యింది. మరో 10 లక్షల చీరలు ప్రాసెసింగ్ లో ఉన్నాయి. వాటిని వారంలో డిజైనింగ్ పూర్తి చేసి రెడీ చేస్తాం. లూమ్స్ పై ఉన్నా చీరల ప్రొక్యూర్ మెంట్ కోసం ఈ నెల 30 వరకు ప్రభుత్వం గడువు పెంచింది. ఇందిరమ్మ చీరలు నాణ్యత తో తయారు చేశాం.
-ఎన్.వెంకటేశ్వర్ రావు, టెస్కో జనరల్ మేనేజర్