
కంటెంట్ ఉంటే చాలు.. బడ్జెట్ తో సంబంధం లేదు. అందరికి తెలిసిన హీరో, హీరోయిన్స్ తో పనిలేదు.. చిన్న నటులైనా బాక్సాపీస్ బద్దలుకొట్టేస్తారు. కథ నచ్చితే చాలు ప్రేక్షక దేవుళ్లు నెత్తినపెట్టుకుంటారు. కలెక్షన్ల వర్షం కురిపించేస్తారు.. దీనికి ఉదాహరణే లేటెస్ట్ గా వచ్చిన ' కొత్త లోక ' ( లోక చాప్టర్ 1 : చంద్ర' ). సుమారు రూ . 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ చిత్రాలను సైతం బొల్తొ కొట్టించి ఊహించని విధంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సూపర్ ఉమెన్ గా ..
'హలో' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్.. ఆ తర్వాత 'చిత్రలహరి', 'రణరంగం' వంటి చిత్రాల్లో నటించినా అంతగా సక్సెస్ ను అందుకోలేకపోయింది. ఇప్పుడు తన మాృతభాష మలయాళం నుంచి వచ్చిన' కొత్త లోక' తో దూసుకెళ్తోంది. సూపర్ ఉమెన్ గా వచ్చి ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
'బాహుబలి 2'ని మించిన వసూళ్లు..
'లోక చాప్టర్ 1 : చంద్ర' విడుదలైన 15 రోజుల్లోనే మలయాళిలో రూ.74.7 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించిందని సాక్నిల్క్ నివేదిక తెలిపింది. ఇది గతంలో కేరళలో రూ. 73 కోట్లు వసూలు చేసిన 'బాహుబలి 2' రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టడం విశేషం. ఈ విజయం సినిమా లభించిన ప్రేక్షకారణకు, బలమైన మౌత్ టాక్‌కు నిదర్శనం. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కేవలం 13 రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును దాటింది. మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. కేరళ బాక్సాఫీస్ వద్ద 'ఆడుజీవితం', 'ఆవేశం' వంటి సినిమాల రికార్డులను అధిగమించే దిశగా దూసుకుపోతోంది. 15వ రోజు ఈ చిత్రం రూ.3.85 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
ఫాంటసీ డ్రామాతో..
ఈ చిత్రాన్ని వేపేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించగా డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. స్వతంత్రానికి పూర్వం ఉన్న భారతదేశం నేపథ్యంలో ప్రేమ, శక్తి, త్యాగం వంటి అంశాలను ఈ ఫాంటసీ డ్రామాలో అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో, తండ్రి అదృశ్యమయ్యాక తనలో అసాధారణ శక్తులను కనుగొనే 'చంద్ర' పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా విజయానికి మరో ముఖ్య కారణం శాంతి బాలచంద్రన్ అందించిన అద్భుతమైన స్క్రీన్‌ప్లే. ఆమె రచన సినిమాకు ఎమోషనల్ డెప్త్ తీసుకువచ్చింది. దీనిపై తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ ఆనందం వ్యక్తంచేసింది. 'మలయాళంలో 'లోక చాప్టర్ 1 : చంద్ర' సక్సెస్ తర్వాత అందరూ నన్ను ఫీమేల్ సూపర్ హీరో అని పిలుస్తున్నారు. నా ఆనందాన్ని మాటల్లో చె ప్పలేను అని సంతోషం వ్యక్తం చేసింది.
సరికొత్త ఫార్ములాతో..
'లోక చాప్టర్ 1 : చంద్ర' చిత్రాన్ని సంప్రదాయ జానపద కథలను, ఆధునిక సూపర్ హీరో ఎలిమెంట్స్‌ను కలిపి ఒక అరుదైన ప్రయోగాన్ని చేసి చూపించారు. నటి కళ్యాణి ప్రియదర్శన్‌తో పాటు, నాస్లెన్, శాండీ, అరుణ్ కురియన్, చందు సలీంకుమార్ వంటి నటులు కూడా తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. మలయాళ సినిమాకు ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచిన ఈ చిత్రం ఒక విప్లవాత్మక ఫీమేల్ సూపర్ హీరో థ్రిల్లర్‌గా నిలిచింది. ఇది కేవలం ఒక బాక్సాఫీస్ సంచలనం మాత్రమే కాదు.. ఫాంటసీ, జానపద కథలు, మహిళా సాధికారతలను కలిపి ఒక వినూత్న ప్రయోగం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.