
- జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక
- స్వచ్ ఏవమ్ హరిత విద్యాలయ సర్వేలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ పాల్గొనేందుకు అవకాశం
మెదక్/సంగారెడ్డి, వెలుగు: స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, పచ్చదనం, పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, విద్యుత్ పొదుపు, సోలార్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ‘స్వచ్ ఏవమ్ హరిత విద్యాలయ’ పేరుతో సర్వే చేపడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఈ సర్వేలో పాల్గొనవచ్చు. నిర్దేశిత అంశాల ఆధారంగా స్కూళ్లకు రేటింగ్ ఇస్తారు. మౌలిక వసతులు, వ్యర్థాల సమర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పొదుపు, సౌరశక్తిని వినియోగించుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
అన్ని స్కూళ్లకు అవకాశం..
స్వచ్ ఏవమ్ హరిత విద్యాలయ సర్వేలో గవర్నమెంట్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, జడ్పీ హైస్కూళ్లు, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్, ప్రైవేట్ స్కూళ్లు పాల్గొనే అవకాశం ఉంది. సర్వేలో 60 ప్రశ్నలు, 125 మార్కులు ఉంటాయి. నీటి సంరక్షణ, తాగునీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్ల నిర్వహణ, వ్యక్తిగత శుభ్రతకు 27, మొక్కలు, తోటల పెంపకానికి 14, వ్యర్థాల నిర్వహణకు 21, విద్యుత్ పొదుపు, సోలార్ వినియోగానికి 20, పర్యావరణ పరిరక్షణ, అవగాహనకు 21 మార్కులు ఉంటాయి. 35 నుంచి 50 మార్కులు వచ్చిన స్కూళ్లకు 2 స్టార్, 51 నుంచి 74 మార్కులు వచ్చిన స్కూళ్లకు 3 స్టార్, 75 నుంచి 89 మార్కులు వచ్చిన స్కూళ్లకు 4 స్టార్, 90 నుంచి 100 మార్కులు వచ్చిన స్కూళ్లకు5 స్టార్ రేటింగ్ ఇస్తారు. జిల్లాస్థాయిలో ఎంపికైన స్కూళ్లకు 3 స్టార్ రేటింగ్, రాష్టస్థాయిలో ఎంపికైన స్కూల్స్‌కు 4 స్టార్ రేటింగ్, జాతీయ స్థాయిలో ఎంపికైన స్కూళ్లకు5 స్టార్ రేటింగ్ ఇస్తారు. 5 స్టార్ రేటింగ్ వచ్చిన స్కూల్ కు రూ.లక్ష బహుమతిగా లభిస్తుంది. ఆ నిధులను స్కూల్ అభివృద్ధికి వినియోగించుకోవచ్చు.
శిక్షణ పూర్తి..
మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌తో కలిపి 1,130 స్కూళ్లు ఉండగా, వాటిలో 1,23,626 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌తో కలిపి 2,053 స్కూల్స్ ఉన్నాయి. ఈ మేరకు స్వచ్ ఏవమ్ హరిత విద్యాలయ సర్వే నిర్వహణకు సంబంధించి టీచర్స్ కు శిక్షణ పూర్తయింది. ఈ సర్వేలో పాల్గొనేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఈ నెల 30 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
ఎంపిక ఇలా..
కలెక్టర్, డీఈవో, డీఎంహెచ్ వో, ముగ్గురు టీచర్లతో కూడిన డిస్ట్రిక్ట్ లెవల్ సెలక్షన్ కమిటీ స్కూళ్లను పరిశీలించి గైడ్ లైన్స్ కు అనుగుణంగా రూరల్ ఏరియా నుంచి 6 స్కూళ్లు, అర్బన్ ఏరియా నుంచి 2 స్కూళ్లతో కలిపి 8 బడులనుఎంపిక చేస్తుంది. రాష్ట్ర స్థాయి సెలక్షన్ కమిటీ రాష్ట్రంలోని రూరల్ ఏరియా నుంచి 16, అర్బన్ ఏరియా నుంచి 4 స్కూళ్లతోకలిపి 20 స్కూళ్లను ఎంపిక చేస్తుంది. జాతీయ స్థాయిలో రూరల్ ఏరియా నుంచి 160, అర్బన్ ఏరియా నుంచి 40 స్కూళ్లతో కలిపి 200 స్కూళ్లను ఎంపిక చేస్తారు.
8 స్కూళ్లను ఎంపిక చేస్తాం..
జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి 8 స్కూళ్లను ఎంపిక చేస్తాం. దరఖాస్తులో వాస్తవ పరిస్థితులను మాత్రమే పొందుపర్చాలి. రేటింగ్ కోసం ఈ నెల 30లోగా అప్లై చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల హెచ్ఎంలు, యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవడంపై దృష్టి పెట్టాలి.
- వెంకటేశ్వర్లు, డీఈవో, సంగారెడ్డి-