వరంగల్ జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య

వరంగల్ జిల్లాలో నిరుద్యోగి ఆత్మహత్య
  • ఊర్లో ముఖం చూపించుకోలేకపోతున్నానంటూ నోట్
  • మహబూబాబాద్ జిల్లా సూర్య తండాలో ఘటన

మహబూబాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడినా నియామకాలు సక్రమంగా జరగకపోవడం, పరీక్షల పేపర్లు  లీక్​ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గిరిజన యువకుడు భూక్య విజయ్ కుమార్​(23) ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి, వ్యవసాయ బావిలో దూకి శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలను డోర్నకల్ సీఐ ఉపేందర్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సూర్యతండాకు చెందిన జయరాజు, కల్పనకు కొడుకులు విజయ్ కుమార్, ఆకాశ్ ఉన్నారు. 15 ఏళ్ల కిందట జయరాజు చనిపోవడంతో కల్పన తన తల్లి వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తున్నది. 

కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నది. పెద్ద కుమారుడు విజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీ చేశాడు. కొద్ది రోజుల కిందటి వరకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ.. గ్రూప్ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ వన్ పేపర్ లీక్ అయిందని, ఇప్పట్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదని, తన కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని, తల్లికి ఆసరాగా నిలువలేకపోతున్నానని స్నేహితులతో చెప్పుకుని బాధ పడేవాడు. వారం రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోట్ రాశాడు. ఊర్లో కానీ, ఇంట్లో కానీ ముఖం చూపించుకోలేకపోతున్నానని ఆవేదన చెందాడు. 

అమ్మను మంచిగ చూసుకోవాలని తమ్ముడిని కోరాడు. వెంట తీసుకెళ్లిన పురుగుల మందు తాగి, డోర్నకల్ మండల పరిధిలోని తండా శివారులో బావిలో దూకాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రంతా గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం వ్యవసాయ బావి సమీపంలో దుస్తులు, చెప్పులు కనిపించాయి. దీంతో బావిలో చూడగా విజయ్ మృతదేహం కనిపించింది. వెలికితీసి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. తల్లి కల్పన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.