ఉద్యోగ నియామక ప్రక్రియలో నిబంధనలు సవరించాలె : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఉద్యోగ నియామక ప్రక్రియలో నిబంధనలు సవరించాలె : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్ : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగ నియామక  ప్రక్రియ తెలంగాణలోనే కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థుల సంఖ్యను తగ్గించాలనుకుంటే రాత పరీక్షలో వడపోయాలే తప్ప.. కఠినమైన ఫిజికల్ టెస్టులు నిర్వహించడం సరికాదన్నారు. లక్డికాపూల్ లోని  బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. 

‘‘వ్యక్తిగతంగా నేను చాలా రిక్రూట్ మెంట్ లు చూశాను. దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్ పెట్టారు. అన్ని చోట్లా 3.8 మీటర్లు ఉంటే రాష్ట్రంలో మాత్రం 4 మీటర్లు ఉంది. నాలుగు మీటర్లు జంప్ అంటే ఎంతో శిక్షణ కావాలి.పైగా అన్ని రకాల పోలీసు నియామకాలకు ఒకే దేహ దారుఢ్య పరీక్ష నిర్వహిస్తున్నారు.’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సివిల్, ఏఆర్ పోలీసులతో సమానంగా మిగిలిన పోలీస్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, అభ్యర్థుల సంఖ్య  తగించాలనుకుంటే రాత పరీక్షలో వడపోయాలని సూచించారు. 

కేవలం కొంత మందికే పోలీసులు శిక్షణ ఇచ్చారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు సరైన సదుపాయాల్లేవని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడా ప్రాంగణాల్లో గొర్రెలు, బర్రెలు తిరుగుతున్నాయని చెప్పారు. వెంటనే లాంగ్ జంప్ ప్రక్రియను 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు తమ బాధను వ్యక్తం చేస్తుంటే అరెస్ట్ లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎత్తులో జరిగే తప్పిదాలను గుర్తించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని రిక్రూట్ మెంట్ లు పెట్టడం, హడావిడిగా ప్రక్రియ పూర్తి చేయడం ఇందుకు కారణం అన్నారు. ఎన్నికలకు, నియామకాలకు లింకు పెట్టొద్దని సూచించారు. ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.