హాల్​ టికెట్స్​ ఇచ్చి..  ఎగ్జామ్స్​పెడ్తలేరు

హాల్​ టికెట్స్​ ఇచ్చి..  ఎగ్జామ్స్​పెడ్తలేరు

కరోనా పేరుతో వాయిదా వేసిన సింగరేణి యాజమాన్యం
నాలుగు నెలలుగా తప్పని ఎదురుచూపులు
ఆందోళనలో 26,694 మంది నిరుద్యోగులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ​ఇచ్చి హాల్ ​టికెట్స్​ పంపిణీ చేసిన సింగరేణి యాజమాన్యం నెలలు గడుస్తున్నా ఎగ్జామ్స్​ పెట్టకపోవడంపై నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కంపెనీలో ఖాళీగా ఉన్న ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టాఫ్​ నర్సు ​పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ ​రిలీజ్​ చేసింది. 128 ఫిట్టర్​ పోస్టులకు 4,893, ఎలక్ట్రీషియన్​ 51 పోస్టులకు 8,530, జూనియర్​ స్టాఫ్​ నర్సు ​84 పోస్టులకు 13,271 చొప్పున మొత్తం 26,694 దరఖాస్తులు వచ్చాయి. మార్చి నెలలో ఎగ్జామ్​ పెట్టేందుకు యాజమాన్యం సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగానే హాల్​ టికెట్లను క్యాండిడేట్స్​డౌన్​లోడ్​ చేసుకునేలా ఇంటర్​నెట్​లో పెట్టింది. నోటిఫికేషన్​ రావడంతోనే కోల్​బెల్ట్​ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోచింగ్​సెంటర్లు వెలిశాయి. ఎలాగైనా జాబ్​సాధించాలని నిరుద్యోగులు కోచింగ్ ​సెంటర్లలో చేరారు. ఇంతలోనే ఎగ్జామ్స్​ వాయిదా వేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. కొవిడ్, ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్ల పేర ఎగ్జామ్స్​ వాయిదా వేస్తున్నట్టు యాజమాన్యం మార్చి నెలలో ప్రకటించింది. ఎగ్జామ్స్​ ఎప్పుడు నిర్వహించే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. స్టేట్ ​గవర్నమెంట్​లాక్​డౌన్ ​ప్రకటించిన టైంలో సింగరేణి మాత్రం లాక్​డౌన్​ ప్రకటించలేదు. మైన్స్​ను యథావిధిగా నడిపింది. దీంతో ఎగ్జామ్స్​ను యాజమాన్యం త్వరగానే నిర్వహిస్తుందని దరఖాస్తుదారులు అనుకున్నారు. మరోవైపు స్టేట్ గవర్నమెంట్​ లాక్​డౌన్​ ఎత్తివేసి నెల దాటింది. ఎగ్జామ్​ వాయిదా పడి నాలుగు నెలలు గడుస్తున్నా  పరీక్షలపై సింగరేణి యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మైన్స్​లలో గుంపులుగుంపులుగా వర్కర్స్​ వెళ్తే రాని కరోనా ఎగ్జామ్​ పెడితేనే వస్తుందా అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఎగ్జామ్​డేట్​ప్రకటించాలని డిమాండ్​ చేస్తున్నారు.