
శంషాబాద్‌లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
హైదరాబాద్/శంషాబాద్/ముషీరాబాద్, వెలుగు: లిక్కర్ స్కాంలో కూతురు కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేలా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆరోపించారు. కేసీఆర్ కుట్రలకు నిరుద్యోగులు ఎప్పటికీ తలవంచరని, ఇప్పటికైనా నిద్ర మత్తు వదిలి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం శంషాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు గోవర్ధన్, సురేశ్, అశోక్, మహేశ్, పవన్ గౌడ్, ప్రదీప్ చారి, పలువురు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.
వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చినోళ్లు అరెస్ట్
సీఎం కేసీఆర్ గతంలో తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ వినతిపత్రాలు ఇచ్చేం
దుకు తెలంగాణ భవన్ కు వచ్చిన డీఎస్సీ 2008 మెరిట్ బీఈడీ క్యాండిడేట్స్ అసోసియేషన్ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం జరగగా అక్కడికి వచ్చిన సీఎం కేసీఆర్, మంత్రులు, పార్టీ లీడర్లను అసోసియేషన్సభ్యులు కలిసి గోడు వెల్లబోసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పీఎస్కు తరలించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తుచేస్తుంటే, అరెస్టు చేయడం సరికాదని బాధితులు వాపోయారు.
కవితను అరెస్ట్ చేయాలి: విద్యార్థి జేఏసీ
లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉన్న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ గద్దల అంజిబాబు డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపి నిజాలు తేల్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇతరులకు ఒక న్యాయం.. సీఎం కూతురికి మరొక న్యాయమా అని ప్రశ్నించారు. ‘లిక్కర్ డాన్ హటావో.. తెలంగాణ బచావో’ నినాదంతో శుక్రవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ విద్యార్థి జేఏసీ, తెలంగాణ దళిత ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. అంజిబాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు కిరాయి ఇంట్లో ఉన్న కవితకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అని నిలదీశారు.