విధాన వైఫల్యం నిరుద్యోగ సంక్షోభం..! ‘రాజీవ్ యువ వికాసం’ ఏది..?

విధాన వైఫల్యం నిరుద్యోగ సంక్షోభం..! ‘రాజీవ్ యువ వికాసం’ ఏది..?

ప్రభుత్వాల విధాన నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో విఫలం కావచ్చు.  అనుకోని దుష్ఫలితాలనివ్వొచ్చు. అందుకు కారణం పాలనా వ్యవస్థలో సమన్వయ లోపం,  విధి విధానాల రూపకల్పనలో హేతుబద్ధత లోపించడం కావొచ్చు. ఇందుకు మన దేశంలో అనేక ఉదాహరణలున్నాయి. కానీ,  వైఫల్యాలనే విధాన నిర్ణయాలుగా చేసుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది.  

కీలకమైన, రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు సాధ్యాసాధ్యాలేమిటి?  ఆర్థిక వనరుల లభ్యత ఎంత?  ప్రాధాన్యత క్రమం  ఏంటనే  వివేచన లేకుండా.. తోచిన నిర్ణయాలు తీసుకుంటూ, అబద్ధాలను వాగ్దానాలుగా భ్రమింపజేస్తూ రాష్ట్ర  ప్రజలను ఏమార్చింది ప్రభుత్వం. 

తమ  పాలనా వైఫల్యంతో ప్రతిభగల  తెలంగాణ యువశక్తిని నిరుద్యోగ కూపంలోకి లాగింది. అధికార పగ్గాలు చేపట్టక ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, వివిధ కీలక రంగాల స్థితిగతులపై  సంపూర్ణమైన అవగాహన కచ్చితంగా ఉండాలి. అధికారం చేపట్టిన తర్వాత.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అర్థమైన తర్వాతనైనా..  సరైన చర్యలు, విధాన నిర్ణయాలు తీసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేయలేదు. కీలకమైన పారిశ్రామిక రంగం, ఉపాధి కల్పన రంగం, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించడంతోపాటు వీటికి పునాదిగా ఉన్న విద్య, వైద్యం, విద్యుత్ రంగాలపై స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోయింది.

‘రాజీవ్ యువ వికాసం’ ఏది?

ప్రభుత్వ ఆర్థిక స్థితి సహకరించడం లేదు కాబట్టి.. ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించే అవకాశం లేనిపక్షంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన గురించి ఆలోచించాల్సింది. అందుకు అవసరమైన పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీపై ఒక అవగాహనకు రావాల్సింది. అది కూడా చేయలేదు.  కనీసం స్వయం ఉపాధి వ్యవస్థను పటిష్టం చేయాల్సింది.  ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రకటించినా.. అది ప్రకటించిన రోజే అటకెక్కింది.  

స్వయం ఉపాధి పథకాల అమలు, సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యత గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా పథకాలను ప్రకటిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి ప్రాధాన్య రంగాలేవో  నిర్ణయించుకోవడం లేదు. దావోస్ కు వెళ్లారు, మూసీ 
ప్రక్షాళన కోసం మంత్రుల బృందం విదేశీ పర్యటనలు చేశారు. ఫలితాలే  కనిపించడం లేదు.

అనిశ్చితిలో పారిశ్రామిక రంగం

పారిశ్రామిక రంగం అనిశ్చితిలో ఉంది.  ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడుతోంది. 2034 నాటికి  తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే  లక్ష్యమని ప్రభుత్వం  ప్రకటించింది.  కానీ..  పరిశ్రమలను  ఆకట్టుకోవడంలో పురోగతి ఏది?  2వేల మందికి ఉపాధి కల్పించే ‘కేన్స్ టెక్నాలజీ సెమీకండక్టర్ల పరిశ్రమ’ 2024లో  గుజరాత్‌‌‌‌‌‌‌‌కు తరలిపోయింది. ‘ ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్’ పరిశ్రమ బెంగళూరుకు మకాం మార్చింది.  

రెండు ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తామని  గతంలో  ఎంఓయూ చేసుకున్న ‘కాగ్నిజెంట్’ సంస్థ విశాఖకు  వెళుతున్నట్టు  ప్రకటించింది. ఇలా చాలా పరిశ్రమలు తరలిపోయాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది.  రియల్ ఎస్టేట్ రంగం  మందగమనంలో ఉంది. ఈ ప్రభావం  సహజంగానే  నిర్మాణ రంగంపై  పడుతుంది.  అది కాస్తా..  భవన నిర్మాణ కార్మికులుగా ఉపాధి పొందుతున్నవారికి  ప్రాణసంకటంగా మారుతుంది. 

విద్యుత్ రంగంపై ఎల్​నినో ప్రభావం

ప్రభుత్వం ఇటీవలే రిజిస్ట్రేషన్ ధరలను సవరించింది. ఈ మార్పు స్థిరాస్థి రంగంపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది.  2024-–25  ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు,  రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ శాఖ రాబడి దారుణంగా రూ. 8,473 కోట్లకు పడిపోయింది.  ఇది బడ్జెట్‌‌‌‌‌‌‌‌ అంచనాల్లో 45.48% మాత్రమే.  కాగ్ నివేదిక సైతం ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. భాగ్యనగరంలో  దాదాపుగా 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నట్టు ఒక అంచనా.  స్థిరాస్థిరంగం కుదేలైతే ఆ ప్రభావం వారిపై సహజంగానే పడుతుంది.  ఎల్‌‌‌‌‌‌‌‌నినో  ప్రభావం  సైతం విద్యుత్ రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ప్రభావం పరిశ్రమలపై పడనుంది.

నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ‘ఆరుతడి’ పంటలపై ఉచిత సలహాలు ఇస్తూ కాలం వెళ్లబుచ్చుతోంది.  దుర్భిక్షం  కారణంగా  వ్యవసాయరంగం కూడా  కునారిల్లిపోతే  రాష్ట్ర  భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. మొత్తంగా ‘నీళ్లు, నిధులు, నియామకం’ అనే  సమున్నతమైన  స్వప్నంతో  ఏర్పడిన  తెలంగాణ చివరకు... ‘నిరుద్యోగం, దుర్భిక్షం, ఆర్థిక దివాలా దిశగా  సాగడమే  తెలంగాణ చరిత్రలో విషాదం. 

ఇదంతా  చూస్తుంటే  పరిపాలనకు బాధ్యత వహించే పాలకులెవరైనా ఉన్నారా,  ఒక సమగ్ర విధానంతో  వ్యవహరించే ప్రభుత్వం ఉన్నదా అనే అనుమానం కలుగుతోంది.  గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగ  సమస్య  తీవ్రతను గుర్తించకుండా నిర్లక్ష్యం చేశారు.  చేస్తూనే ఉన్నారు.  పరిష్కారం ఏమిటో,  ఎలా ఉపశమింపజేయాలో ఆలోచిస్తే మంచిది.

తీవ్రమైన నిరుద్యోగ సమస్య

దేశంలో తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న గోవా, కేరళ, పంజాబ్‌‌‌‌‌‌‌‌లతోపాటు తెలంగాణ కూడా ఒకటని ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ ఈ ఏడాది మేలో తేల్చింది.  రాష్ట్రంలో  ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుద్యోగి.  ప్రతి వంద మందిలో 20 మంది  నిరుద్యోగులు.  దీంతో నిరుద్యోగ రేటు ఆందోళనకర స్థాయిలో 20.1% కు చేరుకున్నది. ఇది జాతీయ సగటు 14.6% కంటే చాలా అధికం. 

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెలువరించిన నివేదికలో తెలంగాణలో  యువత నిరుద్యోగిత రేటు గ్రామీణ ప్రాంతాల్లో 18.3%గా, పట్టణ ప్రాంతాల్లో 22%గా ఉంది.  సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్​  తరఫున 2019లో జరిపిన సర్వే ప్రకారం 20 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తెలంగాణలో ఉన్నట్లు అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య 35 లక్షలకు చేరిందని అంచనా. 

- అమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సారంగుల, 
అధికార ప్రతినిధి, తెలంగాణ బీజేపీ